Honour Killing Telangana: ‘మామ’లు హంతుకులుగా మారుతున్నారు. 20 ఏళ్ల పాటు తల్లిదండ్రులు పెంచి పెద్దచేస్తే ఆ కూతుళ్లు చాలా వరకు వయసు వచ్చాక నచ్చిన తోడు వెతుక్కుంటున్నారు. ఇందులో 80 శాతం పెళ్లి వరకు వెళ్లడం లేదు. 20 శాతం ప్రేమ జంటలు పెళ్లితో ఏకమవుతున్నాయి. ఇందులో కొంతమంది తండ్రులు ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుళ్లను మాయమాటలతో పెళ్లి చేసుకున్నారని అల్లుళ్లపై పగను పెంచుకుంటున్నారు.. కులాంతర వివాహం తమ పరువు తీసిందని ఇంకొందరు భావిస్తున్నారు.. ముక్కుమొఖం తెలియని వాడికి తన ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మరికొంతమంది ఆలోచిస్తున్నారు. ఇలా కారణం ఏదైనా కూతురు నుంచి ఆమె భర్తను వేరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇందులో కొంతమంది సక్సెస్ అవుతున్నా.. కూతుళ్ల జీవితాలను మాత్రం అంధకారం చేస్తున్నారు.. నాటి ప్రణయ్ నుంచి నేటి రామకృష్ణ మర్డర్ వరకు ‘మామ’ల మర్డ స్కెచ్‌లు వారి ఇగోను చల్లార్చినప్పటికీ కూతురు భవిష్యత్తును.. అల్లుడి కుటుంబాన్ని చీకటి చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు.

-కులాల గోడలు బద్ధలవుతున్నా..
మానవుడు దినదినాభివృద్ధి చెందుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం దిగజారిపోతున్నాడు. సమాజంలో కులాల గోడలు బద్ధలవుతున్నా.. కొందరు అవే కులాల కోసం కన్న పేగులను తెంచేస్తున్నారు. సొంతవారి సంతోషాలకంటే కులం పౌరుషమే తమకు ప్రాణం అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.. ప్రేమకంటే కులమే గొప్పదని భావించే తల్లిదండ్రులు ఒకవైపు.. కన్నవారి సంతోషం, కులం కన్నా తమ ప్రేమే గొప్పదని భావించే తత్వ మరోవైపు.. ఈ ఇరువురి మధ్య అమాయకుల ప్రాణాలు కులం పేరుతో చిద్రమైపోతున్నాయి.
Also Read: Roja: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?
-ఒకే జిల్లాలో పరువు హత్యలు..
పరువుహత్యలన్నీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే జరుగుతుండడం సంచలనంగా మారింది.. కులం పేరుతోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న మర్డర్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కులాలు, పట్టింపులు, పరవు పోయిందనే కారణంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతుళ్లను, వారి భర్తల ప్రాణాలు తీస్తున్నారు.
– 2017 మే 16న భువనగిరి జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్న నరేశ్ అనే యువకుడిని యువతి తండ్రి దారుణంగా హత్య చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలంలోని పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలకు చెందిన అంబోజు నరేష్, స్వాతి కళాశాలలో చదువుకునే రోజుల నుంచే ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలకు భయపడి మహారాష్ట్రకు పారిపోయి ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో కన్నతండ్రి.. వారి ప్రేమ పెళ్లిని అంగీకరిస్తానని నమ్మించి.. తిరిగి రప్పించాడు.. సినీఫక్కీలో తన కుమార్తె ఇష్టపడి కట్టుకున్నవాడిని అంతమొందించాడు. ఈ ప్రేమపెళ్లి చేసుకున్న కుమార్తె స్వాతి తన పుట్టింటిలోనే అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. అయితే అప్పట్లో అత్యంత నాటకీయంగా కిడ్నాప్, హత్య, మృతదేహం దహనం, చితాభస్మం మూసీలో కలిపిన ఘటనలతో జరిగిన ఈ పరువు హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ హత్య కేసులో యువతి తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డిని, అతడికి సహకరించిన సత్తిరెడ్డిని పోలీసులు అరెస్టుచేసి కిడ్నాప్, హత్య, సాక్ష్యాధారాలను మాయం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
– 2018, సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించడం అప్పట్లో సంచలనమైంది. ప్రణయ్ హత్యకు అమృత తండ్రి మారుతీరావు రూ.కోటి సుపారీ ఇచ్చాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చర్చిబజార్‌కు చెందిన పెరుమాళ్ల బాలస్వామి పెద్దకుమారుడు ప్రణయ్(24) బీటెక్ పూర్తి చేశాడు. హైస్కూల్‌స్థాయి నుంచే పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్, రియల్టరైన తిరునగరు మారుతీరావు ఏకైక కుమార్తె అమృతతో ప్రేమలో పడ్డాడు. ఘట్‌కేసర్‌లోని శ్రీనిథి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రణయ్ బీటెక్ చదువుతుండగా, అమృత సైతం బీటెక్ చదివేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. కాలేజీ స్థాయిలో వీరిరువురు ప్రేమించుకుంటూ పెళ్లికి సిద్ధపడ్డారు. ప్రేమ విషయాన్ని ఇరువురు వారి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌తో కుమార్తె వివాహం జరిపేందుకు మారుతీరావు విభేదించాడు. దీంతో ఇంటినుంచి బయటకొచ్చిన అమృత ప్రణయ్‌తో కలిసివెళ్లి 2018, జనవరి 31న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్ మందిరంలో పెళ్లి చేసుకొని మిర్యాలగూడకు తిరిగొచ్చారు. పెళ్లి విషయం తెలుసుకున్న మారుతిరావు (వైశ్య సామాజికవర్గం) అప్పట్లో ప్రణయ్ కుటుంబీకులను బెదిరించగా రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం అమృత గర్భం దాల్చింది. ఐదో నెల కావడంతో వైద్యపరీక్షలు జరిపించేందుకు ప్రణయ్ తన కారులో సోదరితో కలిసి అమృతను మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి వచ్చాడు. మధ్యాహ్నం 1 గంట తరువాత ఆస్పత్రి నుంచి బయటకొచ్చి కారు వద్దకు చేరుకుంటున్న సమయంలో ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ చాటున మాటువేసిన సుపారీ తీసుకున్న ఓ కిరాయి గుండా వీరి కదలికపై నిఘా పెట్టాడు. బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వెంబడించిన హంతకుడు ప్రణయ్‌పై కత్తితో దాడిచేసి మెడభాగంలో బలంగా మోదాడు. దీంతో కిందపడ్డ ప్రణయ్‌పై మరోమారు కత్తివేటు వేయడంతో మెడ సగభాగం తెగి రక్తపు మడుగులోనే మృతిచెందాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 అయిన మారుతిరావును అరెస్ట్ చేశారు. అనంతరం మారుతీరావు హైదరాబాద్‌లో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
– తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రామకృష్ణ హత్య కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రామకృష్ణను హత్య చేయించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన ఎరుకల రామచంద్రుడు, కళమ్మ దంపతుల కుమారుడు రామకృష్ణ(35)ను అతని మామ వెంకటేశ్ హత్య చేయించాడు. తన కూతురును పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి రామకృష్ణను మట్టుపెట్టించాడు.

– ప్రాణాలకంటే పరువే ముఖ్యం..
ఈ మూడు మర్డర్లు.. మామలు చేసిన, చేయించినవే. కులాలు, పట్టింపులు, ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనే కారణాలే ఈ హత్యలకు ప్రధాన కారణాలు. కూతుళ్ల ప్రాణాలు, వారి సంతోషం సుఖాల కంటే పరువు ముఖ్యమని తెగించిన తల్లిదండ్రుల పంతానికి పలువురు అసువులు బాయాల్సి వచ్చింది. సమాజం ఆధునిక యుగంతో ముందుకు సాగుతున్నప్పటికీ ఇంకా పరువు పరువు అంటూ పరిగెడుతూ ప్రాణాలు తీస్తున్న ఈ మృగాళ్ల మార్పు ఎప్పుడు వస్తుందో చూడాలి మరీ..
Also Read: TRS vs Governar: ఓవర్ టూ ఢిల్లీ : మళ్లీ హస్తిన పర్యటనకు గవర్నర్ తమిళిసై.. మోదీ, షాతో భేటీ?