Mysore Sandal Success Story: అది 1916 ప్రాంతం.. దేశ స్వాతంత్య్రానికి ముందు మొదలైన కథ ఇదీ.. మైసూర్ సామ్రాజ్యాన్ని రాజా కృష్ణరాజా వడియార్-4 పాలిస్తున్నారు. మైసూర్ రాజ్యం అప్పటికే చందనాన్ని ఎగుమతి చేయడంలో ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రపంచం మొత్తం మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా బిజీగా ఉన్న రోజులు అవీ.. పంటలు పండించే వ్యవస్థ మొత్తం ధ్వంసం అయ్యి తిండి దొరకడం కూడా కష్టంగా మారాయి.
యుద్ధంతో యూరప్ దేశాలన్నీ తలమునకలై వారి పొలాలన్నీ బాంబులతో నిండిపోయాయి. యుద్ధంతో రైతులు కూడా పంటలు వేయలేదు.దీంతో ఆహార కొరతతో యూరప్ దేశాలు సతమతమయ్యాయి. అలాంటి సమయంలో భారత్ లోని మైసూర్ నుంచి ‘చందనం’ దిగుమతి చేసుకునే స్థాయిలో యూరప్ దేశాలు లేవు. మొదటి ప్రపంచ యుద్ధంతో అత్యంత దారిద్య్రపు ఛాయలు ప్రపంచాన్ని కమ్మేసిన కాలమదీ..
Also Read: GST Council Tilts Towards Rate Hikes: మోడీ బాదుడు: ఆఖరుకు పెరుగు, మాంసాన్ని కూడా వదలవా?
మైసూర్ రాజ్యంలో నాడు చందనం ఎగుమతి అనేది ఒక మంచి ఉపాధిని, లాభాన్ని తెచ్చిపెట్టే ఒక మంచి వ్యాపారంగా నాడు ఉండేది. కానీ ఎగుమతి లేకపోవడంతో నాటి మైసూర్ రాజుకు నష్టంతోపాటు ఉపాధి లేక అక్కడి వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది చూసిన రాజా కృష్ణ వడియార్-4 ఈ చందనం నిల్వలను ఎలా ఉపయోగించాలని బాగా ఆలోచించాడు. మైసూర్ రాజు ఈ సబ్బుల పరిశ్రమ స్థాపన కోసం దేశంలోనే నంబర్ 1 ఇంజినీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాయం కోరాడు. ఆయన సూచన మేరకు చివరకు చందనం నుంచి తీసే నూనె నుంచి సబ్బులు తయారు చేసే పరిశ్రమ పెట్టాలని బెంగళూరుకు దగ్గరలో మొదటి సారి ఒక ‘సబ్బుల’ కంపెనీని మొదలుపెట్టాడు. అప్పటికీ గంధపు చక్కల ఎగుమతిలో ప్రపంచంలోనే మైసూర్ రాజ్యం అగ్రస్థానంలో ఉండేది. యుద్దంతో రాజ్యంలో భారీగా గంధపు చక్కలు మిగిలిపోయాయి. వాటి నుంచి తైలం తీసి సబ్బుల తయారీ చేపట్టారు. మొదటి సబ్బులను మైసూర్ రాజుకు ఇవ్వగా వాడగానే అబ్బురపడ్డారు.
దీంతో వెంటనే దివాన్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి ఈ సబ్బులను ప్రజలకు తక్కువ ధరకు ఇద్దామని.. పెద్ద ఎత్తున సబ్బుల తయారీ పరిశ్రమను నిర్మిస్తామని సలహాలు కోరాడు. మోక్షగుండం ఈ సబ్బుల తయారీ కోసం ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ముంబై నుంచి శాస్త్రవేత్తలను రప్పించారు. యువ, ప్రతిభవంతుడైన ‘సోలే గరలపూరి శాస్త్రిని’ ఇంగ్లండ్ పంపించి సబ్బుల తయారీని పరిశీలించి రావాలని కోరారు. విశ్వేశ్వరయ్య కలను సాకారం చేయడంలో గరలపూరి శాస్త్రి ఎంతో కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత మోక్షగుండం సూచన మేరకు బెంగలూరులోని కేఆర్ సర్కిల్ లో పెద్ద ఫ్యాక్టరీని స్థాపించి సబ్బుల తయారీని చేపట్టారు. ప్రజలకు తక్కువ ధరకే ఈ సబ్బులను మార్కెట్లోకి విడుదల చేశారు. ఫ్యూర్ చందనం నుంచి తయారుచేసే ఈ సబ్బులనే ‘మైసూర్ సాండల్ సోప్’ అని పిలుస్తున్నారు. వీటికి ప్రజల నుంచి నాడు అనూహ్య స్పందనవచ్చింది.
తర్వాత కాలంలో ఈ సబ్బు నాణ్యత బాగా ఉందని ప్రజలు గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సబ్బు ప్రసిద్ధి చెందింది. 1944లో శివముగ్గలో మరో మైసూర్ సబ్బుల కంపెనీనీ స్థాపించారు. అయితే 1980 నుంచి ఈ రెండు కంపెనీలను కలిపి పిలవడం చేస్తున్నారు. దీన్ని ‘కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్’గా మార్చి ప్రభుత్వం టేకోవర్ చేసి జాతీయం చేసింది.
-ప్రపంచంలోనే 100శాతం సాండిల్ వుడ్ సబ్బు ఇదీ!
ప్రపంచంలోనే 100శాతం శుద్ధమైన నాణ్యమైన చందనం ఆయిల్ తో తయారు చేసిన నంబర్ 1 సబ్బు ‘మైసూర్ సాండల్ సబ్బు’.మనం ఈ మైసూర్ శాండిల్ సోప్ మీద చూసే లోగోను ‘శరభా’ అంటారు. ఇక మైసూర్ శాండిల్ సోప్ లోగోకు ఎంతో ప్రత్యేకత ఉంది. సింహం శరీరం.. ఏనుగు తలతో పురాణాల్లో ‘శరభా’లా లోగో ఉంటుంది. ఈ గుర్తు దైర్యానికి, బుద్దికి, బలానికి సంకేతంగా భావిస్తారు.
2006లో మైసూర్ సాండిల్ సోప్ కు జియోగ్రాఫికల్ ట్యాగ్ గుర్తింపు లభించింది. 85శాతం మైసూర్ సాండిల్ సోప్ సబ్బులు ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులోనే అమ్ముడవుతున్నాయి.
అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకానొక సమయంలో ఈ కంపెనీ తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. లాభాల నుంచి నష్టాల వైపు కంపెనీ పడిపోయింది. మంచి మార్కెటింగ్ వ్యవస్థ లేక కొనుగోళ్లు తగ్గిపోయాయి. దానికి కారణం మార్కెటింగ్ అని అర్థమై కార్మికులు తామే స్వయంగా మైసూర్ సాండిల్ సోప్ గొప్పతననాన్ని వివరిస్తూ వారే మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. తమ అభివృద్ధి కంపెనీ వృద్దిలో ఉందని గమనించారు. ఎవరు ఎక్కువ సేల్స్ చేస్తారో వారికి బంగారు, వెండి నాణేలను కంపెనీ బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో తిరిగి కంపెనీ లాభాల బాట పట్టింది.
2006లో ఎంఎస్ ధోనిని తమ బ్రాండ్ అంబాసిడర్ గా మైసూర్ సాండల్ కంపెనీ నియమించుకుంది. అయినా కూడా తన ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 25శాతం మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. కావాల్సినంత శాండిల్ ఆయిల్ అందుబాటులో లేకపోవడం ఒక కారణంగా చెప్పొచ్చు. కార్మికులు తలుచుకుంటే ఎంత నష్టాల్లో ఉన్న కంపెనీ అయినా లాభాల బాటపట్టొచ్చు అని ‘మైసూర్ సాండిల్ సోప్’ కంపెనీ నిరూపించారు.
ఏది ఏమైనా భారతదేశంలోని సబ్బుల్లో ‘మైసూర్ సాండిల్’కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యూర్ నేచురల్ సోప్ గా ఇది ఖ్యాతి గడిచింది. చాలా మంది ఇప్పటికీ ఈ సబ్బుకు ఫేవరెట్ గా మారి వినియోగిస్తున్నారు. మైసూర్ రాజు మన చందనం నిల్వల కోసం తయారుచేయించిన ఈ సబ్బు ఇప్పటికీ ప్రజాదరణ పొంది మార్కెట్లో అమ్ముడవుతోంది.
Also Read:YCP Politics: వైసీపీలో ‘కుట్ర’ కోణాలు..! సంచలన అడజడులు