https://oktelugu.com/

If not a job? : ఉద్యోగం లేకపోతే చచ్చిపోవాలా?

If not a job?: జీవో 317.. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీల కోసం తీసుకొచ్చిన ఈ జీవో ఇప్పుడు గుబులు రేపుతోంది. శాస్త్రీయంగా లేని ఈ జీవో వల్ల స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీ పరంగా బదిలీలు సాగుతున్నాయి. దీంతో జూనియర్లకు అన్యాయం జరుగుతూ ఉమ్మడి జిల్లాలోని తమ సొంత జిల్లా విడిచి మారుమూల కొత్త జిల్లాకు పోవాల్సి వస్తోంది. దీన్ని తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులు తమవాళ్లకు దూరమై మానసికంగా కృంగిపోయి చనిపోతున్నారు. గుండెపోటుతో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2022 / 09:16 PM IST
    Follow us on

    If not a job?: జీవో 317.. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీల కోసం తీసుకొచ్చిన ఈ జీవో ఇప్పుడు గుబులు రేపుతోంది. శాస్త్రీయంగా లేని ఈ జీవో వల్ల స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీ పరంగా బదిలీలు సాగుతున్నాయి. దీంతో జూనియర్లకు అన్యాయం జరుగుతూ ఉమ్మడి జిల్లాలోని తమ సొంత జిల్లా విడిచి మారుమూల కొత్త జిల్లాకు పోవాల్సి వస్తోంది. దీన్ని తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులు తమవాళ్లకు దూరమై మానసికంగా కృంగిపోయి చనిపోతున్నారు. గుండెపోటుతో ఒకరు.. ఆత్మహత్య చేసుకొని మరొకరు మరణించారు. ఉద్యోగం వదలాలంటే భయం.. మార్పునకు సిద్ధపడకపోవడం.. కొత్త ప్రాంతంలో బతకలేకపోవడం వీరి లోపం..

    ఈ సమస్య వీళ్లదే కాదు, మనందరిదీ. జీతానికీ, జీవితానికీ మధ్య తేడా తెలుసుకోని మనందరిదీ. వీళ్లు చచ్చి బ్రతికిపోయారు, మనం చస్తూ, చంపేస్తూ శవాలుగా నడుస్తున్నామంతే!

    లోపం మన జీవనపద్దతిలో ఉంది. మనలో ఇంకించిన సంప్రదాయంలో ఉంది. ఎవరినైనా సరే నిలదీసి అడగండి “నాకు ఈ పని తప్ప మరోటి తెలియదు, రాదు” అనేది స్పష్టంగా ప్రకటించే మాట. వ్యవసాయం తప్ప, నా ఈ వ్యాపారం తప్ప, నా ఈ రంగంలో అనుభవం తప్ప.. అనేదే వినిపిస్తుంది. దీనికి కారణం మార్పుని అంగీకరించడానికి తెలివి లేకపోవడం. అసలు మార్పు అనేదే సంస్కృతికి, సంప్రదాయానికి, స్వధర్మానికి విరుద్ధమైనది, అది అనైతికమైనది అనేది మన మనసుపొరల్లో మొదటిపొరగా ఏర్పడి ఉంటుంది. మార్పు అంటే తెలుసుకోవడం అంటే అదనపు శ్రమ చేయాలి. ఒక్కసారి ఒక పనిలో, ఉద్యోగంలో చేరాక ఏ తెలివి అవసరం లేదు. ఎద్దుని సాలులో వదిలినట్లు శరీరాన్ని వదిలేస్తే అదే చేసుకుంటూ వెళుతుంది. అది ఎంత చాకిరీ, తక్కువ ఆదాయం, మునుముందు పోటీకి నిలవకపోవడం.. ఇవన్నీ మనకనవసరం! కింద చెర్వులోని బురదలో చల్లదనం, పైన సూర్యుని వెచ్చదనం..మోరెత్తి అరమోడ్పు కన్నులతో సగం మునిగిన శరీరం మీద పక్షులు వాలి పొడుస్తుంటే ఆస్వాదించే ఎనుములం మనం!

    ఈ పరిస్థితిలో పరిచయాలన్నీ మన తోటి ఎనుములతోనే. ఏ గడ్డి తినాలి, ఏ కుడితి తాగాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎన్ని పాలివ్వాలి.. ఇలా. ఇవన్నీ తమ జాతి పనులు, తమ పూర్వీకుల పనులు పద్దతి తప్పకుండా తల ఎత్తకుండా చేస్తాయి. లేకపోతే యజమానికి కోపమొస్తుంది, ఇంట్లోనుండి వదిలేస్తే బ్రతకడం రాదు. కాబట్టి జట్టుగా నిలబడి, ఉద్యోగాన్ని, పనిని, జీతాన్ని జీవితం మొత్తంలో పరిచేసుకుంటారు. తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా లాగేసుకుంటారు. వాళ్ళ భార్యలు “మా సారు ఇంకా రాలేద”ని అమ్మలక్కలతో ప్రస్తావిస్తారు. ఫలానా ఉద్యోగి కొడుకు, కూతుళ్ళుగా పిల్లలు పిలవబడతారు, బంధువుల్లో ఫలానా పనిచేసే ఉద్యోగిగా గుర్తింపబడతారు.
    తాము చేస్తున్న పనిలో చిన్న కదలిక వచ్చినా కదిలిపోతారు. ఈ భయంతో వాటిని ఎదుర్కోవడానికి సంఘాలలో సభ్యత్వం తీసుకుంటారు. నోట్, మెమో, చార్జెస్, ఎంక్వైరీ, బదిలీ ఏదైనా భయమే. చాలామంది రిటైర్మెంట్ కాగానే తెలియని ఒంటరితనం, చెప్పలేని వేదనతో, ఆత్మన్యూనతతో చచ్చిపోతారు ఇందుకే. వాళ్లకి భార్య కాఫీ ఆలస్యంగా ఇస్తే కూడా, నా పవరుపోయిందేమోనన్న శంకతో చనిపోతారు.

    ఏ వైద్యుడైతే కేవలం సాటి వైద్యులతోనే ఉండడో, ఏ టీచరు టీచర్లతోనే జీవితాన్ని మూడేసుకోడో, ఏ ఉద్యోగి తన ఉద్యోగంలోనే మురిగిపోడో, ఏ వ్యాపారి, ఏ పనివాడు తన వ్యాపారంలో, తన పనిరంగాన్ని దాటి విస్తరిస్తాడో వాడే గొప్పవాడు. వాడు ఎవరికీ భయపడడు. ఈ పని కాకపోతే వాడికి మరో పని తెలుసు. ముఖ్యంగా తనకి బ్రతకగలననే ధైర్యం వుంటుంది.

    బాగా గుర్తు. వర్తమాన చరిత్రమీద పుస్తకం రాస్తే మా ప్రొఫెసర్ ముందు మాట కాదు, కవర్ పేజీ వెనక రెండే రెండు వాక్యాలు రాయమంటే, “ఇలాంటి సీరియస్ విషయాలు మాలాంటి అకడమీషన్స్ రాయాలి. ఎప్పుడో సబ్జెక్ట్ చదువుకున్నంత మాత్రాన సరిపోదు” అన్నారు. అతి బలవంతమ్మీద పుస్తకం చదివిస్తే, రెండు వాక్యాలు రాయడం కుదరదన్న అయన, 8పేజీలు ముందుమాట అదనంగా రాసిచ్చారు.

    ఐదారు ఉద్యోగాలు మారిన నన్ను, ఒక అధికారి అందరినీ గదికి పిలిచి, కలిపి తిట్టేసి మెమో ఇస్తాననన్నాడు. అందరూ నిశ్శబ్దంగా బయటికొస్తూంటే నేను కావాలనే వినపడేలా గొణుక్కుంటూ బయటికొస్తే, ఆయన బలవంతంగా తన గదికి పిలిపించాడు బెదిరించడానికి. గదిలోకి వెళ్లక తలుపు దగ్గరకేసి చెప్పాను “ఏం మెమో ఇస్తే బిఫిట్టింగ్ రిప్లై రాయడం రాదా మాకు? ఆ రిప్లైతో మీరు సూప్‌లో పడరా? ఏమనుకున్నారు? మీలాగా గతిలేక ఈ ఉద్యోగం చేస్తున్నామనుకున్నారా? ఇప్పుడు బయటికిపోతే ఇంతకు ఐదురెట్లు జీతం సంపాదించుకోగలం? మీకు ఆ సత్తా వుందా? తీసుకున్న జీతానికి రెండు రెట్లు ఎక్కువే పనిచేస్తున్నాం. ఉద్యోగం కోసం నేనులేను, నాకోసమే ఉద్యోగం వుంది. ఈ బెదిరింపులు ఇంట్లో చేసుకో” అని చెప్పి వచ్చేశాను. ఆయన రిటైరయ్యేదాక నాకు భయపడుతూ, అయనతో పాటు పదిమందికి నా పట్ల భయం పెంచుతూ పోయాడు.

    ఈ క్షణం చేస్తున్న పని వదిలేయడానికి సిద్దంగా వుండాలి. నిరంతరం నైపుణ్యాలకు సానపెడుతూ వుండాలి. ఎప్పుడు అసంతృప్తి అనిపిస్తే అప్పుడు ఆ పనిని వదిలేసే ధైర్యం వుండాలి. అదిలేక మన కులపోళ్లని చుట్టూ పెట్టుకున్నట్లు మన ఉద్యోగస్తుల్ని చూట్టూ పెట్టుకోవడం అభధ్రతా భావం. వృత్తి పట్ల తాదాత్మ్యత, ప్రేమ అనేది తామరాకుమీద నీటిబొట్టులా వుండాలి.

    ఫలానా మనుషులకు, ఫలానా కులంలో, ఫలానా మతంలో, ఫలానా దేశంలో, ఫలానా భాషలో పుట్టినట్లు ఉద్యోగంలో పుట్టి అందులోనే బ్రతుకు సాఫల్యం వెదుక్కోవడం మనిషి బ్రతుక్కి అవమానం. ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని దేశాలు, ఇన్ని అభిప్రాయాలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని కళలు, ఇన్ని పనులు ఉద్యోగాలు, ఇన్ని రంగులు, ఇన్ని పువ్వుల్లో, ఇంతమంది ప్రేమల్లో.. జీవితాన్ని వికసించనీయండి.
    -సిద్ధార్థి