YCP Attacks : వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేయడం ఆమె తప్పు అయ్యింది. ఆమె ప్రశ్నించేసరికి అధికార వైసీపీ నేతలు తట్టుకోలేక పోయారు. నిండు చూలాలు అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. కిందపడేసి కాలితో తన్ని దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సతీమణి కవిత పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆదివారం మొలకలచెరువు మండలం వేపూరి కోట పంచాయితీ కోట గొల్లపల్లెలో ప్రచారం చేశారు. ఇంటింటా ప్రచారం చేసే క్రమంలో కళ్యాణి అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని.. రాత్రిపూట చిన్నారులు బయటి తిరగాలంటే భయం వేస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్ సుదర్శన రెడ్డి తో పాటు ఆయన అనుచరులు ఆమెతో వాదనకు దిగారు. భర్త మల్లికార్జున అడ్డుకోగా ఆయనపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నిండు గర్భిణీ అయిన కళ్యాణిని కింద పడేసి తొక్కేశారు. అయితే ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సతీమణి కవిత అడ్డు చెప్పకపోవడం గమనార్హం.
అయితే వైసిపి నేతల దాడిలో కళ్యాణి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన తరువాత కూడా వైసీపీకి చెందిన ఒక 20 మంది ప్రత్యేక వాహనాల్లో వచ్చి గ్రామంలో గలాటా సృష్టించారు. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో వైసిపి నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా బాధితులు భయం భయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో గడిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి కోరుతోంది.