Crime News : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి తూడుకుర్తి కి చెందిన చింతలపల్లి జగదీష్ (35) 2011లో గద్వాల్ ప్రాంతానికి చెందిన కీర్తి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతడు బిజినపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్నాడు.. కీర్తి కాస్త చదువుకోవడంతో.. ఆమె స్థానికంగా ఉన్న ఎస్బీఎం అనే స్థిరాస్తి సంస్థలో పనిచేస్తోంది. ఈ సంస్థలో బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి కూడా పనిచేస్తూ ఉండేవాడు. కీర్తికి, నాగరాజుకు ఆ సంస్థలో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆదివారం కూడా కీర్తి ఇంటిపట్టున ఉండేది కాదు. ప్రతిరోజు ఆఫీసులో పని ఉందంటూ వెళ్ళిపోయేది. ఇది మొదట్లో జగదీష్ కు తేడాగా అనిపించలేదు. అయితే తర్వాత కీర్తి ప్రవర్తనలో మార్పు రావడంతో అతడు నిలదీశాడు. అంతేకాదు ఆమె తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేశాడు. నాగరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని గుర్తించాడు. దీంతో అతడు కీర్తిని గట్టిగానే హెచ్చరించాడు. అయితే కొద్దిరోజులు కీర్తి నాగరాజుకు దూరంగా ఉంది. విధులకు కూడా వెళ్లడం లేదు. ప్రియుడికి దూరంగా ఉండలేక కీర్తి ఒక దారుణమైన ప్లాన్ రూపొందించింది. భర్తను భూమ్మీద లేకుండా చేయాలని భావించింది. ఇందుకు నాగరాజు సహాయం కోరింది. దీంతో అతడు ఒక ప్రణాళిక రూపొందించాడు.
ఏం చేశారంటే..
జగదీష్ అడ్డు తొలగించుకోవడానికి నాగరాజు మరో వ్యక్తి సహాయంతో అతనిపై దాడి చేశాడు. అయితే జగదీష్ దాని నుంచి బయటపడ్డాడు. ఇది చేయించింది తన భార్య అని అతడికి తెలుసు. ఈసారి కూడా అతడు తన భార్యను హెచ్చరికతో వదిలేశాడు. అయితే తన భర్త అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని భావించిన కీర్తి ఈసారి జగదీష్ ను ట్రాప్ లో పడేసింది. దైవదర్శనం పేరుతో తన తల్లిగారింటికి తీసుకెళ్లింది. నాగరాజు ఇచ్చిన మత్తుమందును కల్లులో కలిపి తన భర్తకు తాగించింది. ఆ మత్తులో జగదీశ్ స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని తూడుకుర్తి గ్రామ శివారులో కారులో నాగరాజుతో కలిసి తీసుకెళ్లింది. ముందుగా అతడికి విద్యుత్ షాక్ ఇచ్చి చంపాలని అనుకున్నారు. అయితే ఆ సమయానికి కరెంటు లేదు. దీంతో కేఎల్ఐ కాలువలో అతడిని పడేశారు. అంతేకాదు అతడిని నీళ్లలో ముంచి దారుణంగా చంపేశారు.
ఇలా వెలుగులోకి
తన భర్తను చంపిన తర్వాత.. ఆ విషయం బయటకు పొక్కకుండా కీర్తి జాగ్రత్త పడింది. రెండు రోజులు అనంతరం కీర్తి భర్త జగదీష్ మృతదేహం అల్లిపూర్ శివారులోని కే ఎల్ ఐ కాలువలో కనిపించింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కీర్తిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కీర్తి, ఆమె తల్లి, సోదరుడు, నాగరాజు తో సహా ఈడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ హత్యలో కీలకంగా మారిన మత్తుమందును నాగరాజుకు మోహన్ గౌడ్ అనే వ్యక్తి అందించాడు. అయితే ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.