Hyderabad: ఆమెకు పెళ్లయింది. ఆజానుబాహుడైన భర్త ఉన్నాడు. వారిద్దరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఇలా తన కుటుంబంతో హాయిగా ఉండాల్సిన ఆమె దారితప్పింది. మరొక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడపడం మొదలుపెట్టింది.. అయితే ఈ విషయం ఆమె భర్తకు తెలిస్తే ఇబ్బంది అని భావించి ప్రియుడితో కలిసి దారుణమైన ప్రణాళిక రూపొందించింది. ఫలితంగా అది ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయగా.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అయితే ఈ వ్యవహారంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు పోలీసులను కూడా నివ్వెర పరిచాయి.
హైదరాబాదులోని ఎల్లారెడ్డి గూడ జయప్రకాష్ నగర్ లో.. ఓ అపార్ట్మెంట్లో విజయ్ కుమార్, శ్రీలత (పేరు మార్చాం) దంపతులు నివసిస్తున్నారు. విజయ్, శ్రీలతకు ఇద్దరు పిల్లలు. అయితే శ్రీలతకు విజయ్ తో పెళ్లి కంటే ముందే రాజేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది. పెళ్లి తర్వాత కూడా శ్రీలత, రాజేష్ మధ్య వ్యవహారం కొనసాగుతోంది. అయితే ఈ విషయం విజయ్ కి తెలిస్తే ఇబ్బంది అని భావించి శ్రీలత విజయ్ కుమార్ (40) ను భూమ్మీద లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాజేష్ తో చెప్పడంతో.. అతడు ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలో రాజేష్ తనకు సనత్ నగర్ ప్రాంతంలో పరిచయం ఉన్న రౌడీ షీటర్ రాజేశ్వర్ రెడ్డి సాయం కోరాడు. రాజేశ్వర్ రెడ్డి పై ఇప్పటికే 8 హత్య కేసులు ఉన్నాయి. రాజేశ్వర్ రెడ్డి సూచనతో రాజేష్ మహమ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్ వద్దకు వెళ్లాడు. విజయ్ హత్యకు సహకరించాలని కోరాడు. ఇందుకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న విజయ్ తన పిల్లల్ని స్కూల్లో దింపేందుకు వెళ్లాడు. అప్పటికే అతడు ఇంటి సమీపంలో రాజేష్, రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ ను శ్రీలత ఇంటికి పిలిపించింది. వారిని బాత్రూంలో దాచింది.
పిల్లల్ని స్కూల్లో దింపి విజయ్ ఇంటికి వచ్చాడు. అతడు రాగానే లోపలి నుంచి గడియ పెట్టింది. వెంటనే రాజేష్, రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ బాత్రూం నుంచి బయటికి వచ్చారు..జిమ్ లో వాడే డంబెల్స్, ఇనుపరాడ్లతో విపరీతంగా కొట్టారు. వారు కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక విజయ్ విపరీతంగా ఏడ్చాడు. నన్ను కొట్టొద్దని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వినిపించుకోకుండా ఆ ముగ్గురు అతన్ని అత్యంత కిరాతకంగా చంపేశారు. విజయ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ ముగ్గురు.. ఆ మృతదేహాన్ని బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. అనంతరం శ్రీలత ఇంట్లో రక్తపు మరకలను మొత్తం తుడిచేసింది. విజయ్ మృతదేహం పై ఉన్న దుస్తులను మార్చేసింది. అంతేకాదు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తన భర్త గుండెపోటుతో చనిపోయాడని మహానటి స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. శ్రీలత చెప్పిన మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు.. విజయ్ అంత్యక్రియలు జరిపించారు.
విజయ్ కుమార్ హత్య అనంతరం రౌడీ షీటర్ రాజేశ్వర్ రెడ్డి వికారాబాద్ పారిపోయాడు.అయితే ఈ విషయం బయటకు వస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని మూడు నెలల పాటు అక్కడే ఉన్నాడు. అయితే విజయ్ ని కొడుతుండగా.. అతడు పదేపదే ప్రాధేయపడిన తీరు రాజేశ్వర్ రెడ్డి కి గుర్తుకు వచ్చేది. దీంతో అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. ఫలితంగా అతడు పోలీసుల ఎదుటకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. విజయ్ కుమార్ ను చంపడం వల్ల తను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అందువల్లే లొంగిపోతున్నట్టు పోలీసుల ఎదుట ప్రకటించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత రాజేశ్వర్ రెడ్డి, శ్రీలత, రాజేష్, మైతాబ్ పై కేసు నమోదు చేశారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్రీలత చేసిన దారుణాన్ని తెలుసుకున్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. అటు తండ్రి చనిపోవడం, ఇటు తల్లి వివాహేతర సంబంధం తో జైలుకు వెళ్లడంతో.. ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.