Darshan Thoogudeepa: తెలంగాణలో ఒక ఖైదీని ఒక మీడియా సంస్థ ఇంటర్వ్వూ చేసింది. అందులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. డబ్బు ఉంటే చాలు జైలులో కూడా లగ్జరీగా బతుకచ్చట. డబ్బు ఇస్తే సాక్షాత్తు జైలు అధికారులే నచ్చిన ఫుడ్ నుంచి ప్రతీ ఒక్కటీ సమకూరుస్తారట. ఇది ఒక సాధారణ ఖైదీ విషయంలోనే జరిగితే.. ఇక సెలబ్రెటీల విషయంలో ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఒక్క బయట తిరగడం తప్పితే.. స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటుందని అనుకోవచ్చు కదా.. ఇటీవల హత్య కోసులో కన్నడ నటుడు, దర్శకుడు దర్శన్ తుగదీపను పోలీసులు బెంగళూర్ లోని పరప్పన అగ్రహా సెంట్రల్ జైలులో ఉంచారు. అక్కడ ఆయనకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఏదో పిక్నిక్ వచ్చినట్లు ఆయన విలాసంగా ఆనందంగా గడిపారు. జైలులో ఆయన ఎలా ఉన్నాడన్న విషయాలు ఫొటోల ద్వారా సోషల్ మీడియాకు ఎక్కడంతో రచ్చమొదలైంది. ఖైదీలకు జైలులో ఇలాంటి వసతులు ఉంటాయా? అంటూ ప్రశ్నల మోత మోగింది. దీంతో పోలీసులు తలలు పట్టుకునేంత పనైంది. ఇక చేసేది లేక ఆయనను గురువారం (ఆగస్ట్ 29) ఉదయం 4 గంటలకు బళ్లారిలోని కేంద్ర కారాగారానికి తరలించారు.
అంతకుముందు రోజు డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శోభా రాణి, బళ్లారి జైలు సూపరింటెండెంట్ ఆర్ లత దర్శన్ తరలింపుపై సమావేశం నిర్వహించారు. హీరోని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడడంతో బళ్లారి జైలు వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఇన్ని రోజులు స్పెషల్ ట్రీట్‌మెంట్ అందుకున్న దర్శన్ కు బళ్లారి జైలులో ఆ సౌకర్యాలు అందడం లేదని తెలుస్తోంది. కొత్త స్థలం, సౌకర్యాలు లేని గదిలో తనను ఉంచారని దర్శన్ చెప్తున్నాడు. ఆధ్యాత్మికతకు సంబంధించిన రెండు పుస్తకాలను తన వెంట తెచ్చుకున్నానని వాటిలో లలితా సహస్రనామ శ్లోకం ఒకటి. అతను చదివి ఉండవచ్చు’ అని జైలు అధికారి ఒకరు తెలిపారు. దర్శన్ బస చేసే ఔటర్ స్పెషల్ సెక్యూరిటీ రూమ్ 10×6 అడుగుల విస్తీర్ణంలో మరుగుదొడ్డి ఉంది.
జైలు మెనూ ప్రకారం.. శుక్రవారం ఖైదీలతో పాటు ఆయనకు ఉదయం ఉప్పు (355 గ్రాములు), మధ్యాహ్నం అన్నం (355 గ్రాములు)-సాంబార్ (655 గ్రాములు), మధ్యాహ్నం మజ్జిగ (205 మి.లీ) ఇచ్చారు. సాయంత్రం మాంసాహారమైన చికెన్ ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. ఖైదీలకు 200 గ్రాముల చికెన్, 90 గ్రాముల మటన్ కామన్ గానే ఇస్తారు ఇవే దర్శన్ కు కూడా ఇచ్చినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
బెంగళూర్ లోని పరప్పన అగ్రహా సెంట్రల్ జైలులో ఉన్న సౌకర్యాలు లేకపోవడంతో దర్శన్ తుగదీప కొంచెం ముభావంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బళ్లారి జైలుకు ఆయన వచ్చి ఒక్క రోజు పూర్తయ్యింది. ఎక్కువగా మాట్లాడడం లేదని, కేవలం తన పుస్తకాలతోనే సమయం గడుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. పరప్పన అగ్రహా సెంట్రల్ జైలులో బాగానే ఉన్న దర్శన్ ఇలా ఎందుకు ఉంటున్నాడన్నదానిపై క్లారిటీ లేదు.
అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం దర్శన్ బయటకు రావాలని కోరుకుంటున్నారు. బళ్లారి ఆరాధ్యదైవం కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ తమ పూజలకు సంబంధించి అమ్మవారి కుంకుమను అందజేయాలని జైలు అధికారులను కోరుతున్నారు.