Rakshitha Case: వారంతా తమిళనాడు( Tamila Nadu) వాసులు. ఒకే కుటుంబానికి చెందినవారు. అటువంటివారు తిరుపతి సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో మృతదేహాలుగా మారారు. అయితే వారు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే ఎవరైనా హత్య చేశారా? అనేది తేలాల్సి ఉంది. తిరుపతి జిల్లా పాకాల సమీపంలోని అటవీ ప్రాంతంలో మృతదేహాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే వీటికి సంబంధించిన మిస్టరీ వీడింది. అడవిలో ఒక మహిళ, పురుషుడి మృతదేహాలు వెలుగుచూసాయి. మరో ఇద్దరినీ సమాధి చేసినట్లు రాళ్లు పేర్చి ఉండడం పశువుల కాపరులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. అయితే ఘటనా స్థలంలో లభించిన ఆసుపత్రికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వారు తమిళనాడు వాసులుగా గుర్తించారు. దీంతో మరణాల మిస్టరీ వీడింది.
* దట్టమైన అటవీ ప్రాంతంలో..
చంద్రగిరి ( Chandragiri) నియోజకవర్గ పరిధిలో.. గాదంకి టోల్ ప్లాజా సమీప ప్రదేశాలు అటవీ ప్రాంతంలో ఉంటాయి. ఇది దట్టమైన అడవి ప్రాంతం. సాధారణ వ్యక్తులు ఎవరు అక్కడ సంచరించరు. అటువంటి చోట ఒక పురుషుడితో పాటు మహిళ మృతదేహం కనిపించింది. కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో అటువైపుగా వెళ్తున్న పశువుల పెంపకం దారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ రెండు మృతదేహాలకు కూత వేటు దూరంలో.. ఇద్దరినీ ఖననం చేసినట్లు చుట్టూ రాళ్లు పేర్చి ఉండడం కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తమిళనాడులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రెస్క్రిప్షన్ దొరికింది. అందులో తంజావూరుకు చెందిన కలయి సెల్వం పేరు నమోదు చేసి ఉంది. ఈ ఆధారంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే అదే సమయంలో తంజావూరుకు చెందిన వెంకటేష్ తన భార్య, పిల్లలు అదృశ్యమయ్యారంటూ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాకాల పోలీసులు ఇచ్చిన సమాచారంతో తాంజావూరు పోలీసులు వెంకటేష్ తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు వెంకటేష్ భార్య, పిల్లలతో పాటు సమీప బంధువు అని నిర్ధారించారు.
* కుటుంబ విభేదాలు..
వీరంతా తమిళనాడులోని నాగపట్నం జిల్లా వివో సి నగర్కు చెందినవారు. మృతులు కలై సెల్వన్( Kalai Selvan ), జయమాల, దర్శిని, వర్షినిగా గుర్తించారు. వెంకటేష్ కువైట్లో ఉండేవారు. ఆయన భార్య జయమాల, పిల్లలు, కలై సెల్వన్ గ్రామంలోనే ఉండేవారు. సెల్వన్ జయమాల చిన్నమ్మ కుమారుడు. ఈ క్రమంలో వెంకటేష్ కువైట్ నుంచి తన భార్యకు 40 లక్షల రూపాయల వరకు పంపించారు. కానీ ఆ సొమ్ము ఆమె ఖాతాలో లేదు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్యతో కలిసి కలై సెల్వన్ ఫైనాన్స్ వ్యాపారం చేసి డబ్బును దుర్వినియోగం చేసినట్లు వెంకటేష్ అనుమానిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే కలై సెల్వన్ పై వెంకటేష్ చీటింగ్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే జూలై 4న జయమాలతో పాటు పిల్లలు, కలై సెల్వన్ కనిపించకుండా పోయారు. దీంతో వెంకటేష్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ రెండు నెలల తరువాత ఇప్పుడు వారు తిరుపతి ప్రాంతంలో మృతదేహాలుగా కనిపించడం విశేషం. అయితే పిల్లలిద్దరినీ హత్య చేసి పూడ్చి పెట్టిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే వీరు హత్యకు గురయ్యారా? అన్నది పోలీస్ విచారణలో తేలనుంది.