Crime News : అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా.. ఉమ్మడి అనంతపురం జిల్లాగా ఉన్నప్పుడు 1998లో దిన్నే హట్టి ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి భార్య, ఇద్దరు కుమారులు సంతానం. మొదటి కొడుకు జన్మించినంత వరకు తిప్పే స్వామి తన భార్యతో బాగానే ఉన్నాడు. రెండవ సంతానం పుట్టిన తర్వాత తిప్పేస్వామి లో భార్యపై అనుమానం మొదలైంది. ఆమెను ప్రతిసారి ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. కోపం తారస్థాయికి చేరినప్పుడు కొడుతూ ఉండేవాడు. ” వాడు నా కొడుకు కాదు. నాకు పుట్టిన వాడు కాదు. నా పోలికలు లేవు. నువ్వు వీడిని ఎవడికి కన్నావ్.. నాకు నువ్వూ వద్దు..వాడు వద్దూ” అంటూ ఆమెను దూషించేవాడు. బంధువుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ తిప్పేస్వామి వ్యవహార శైలి మారలేదు. పైగా తన భార్యపై అనుమానాన్ని మరింత పెంచుకున్నాడు. విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అతడు కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆమె తన పిల్లల్ని తీసుకొని తలిగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారి ఇంటికి వెళ్లిన తిప్పేస్వామి తన భార్యను బాగా చూసుకుంటానని పెద్ద మనుషుల ముందు నమ్మ బలికాడు. అలా తన ఇంటికి వచ్చిన తర్వాత.. మళ్లీ తన పైశాచికత్వాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అయితే ఈసారి మరింత చెలరేగిపోయాడు. తన చిన్న కుమారుడని తనకు పుట్టలేదని ఆరోపిస్తూ తన భార్య ముందే చంపేశాడు. ఆమె కన్న కొడుకు చనిపోయాడని బాధపడుతూ ఏడుస్తుండగా.. పోలీసులు ఎలాగైనా అరెస్టు చేస్తారని భావించి పక్కనే ఉన్న కర్ణాటక కు వెళ్లిపోయాడు.
అక్కడ పెళ్లి చేసుకున్నాడు
కర్ణాటకకు పారిపోయిన తిప్పేస్వామి.. అక్కడ ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. మొదటినుంచి తిప్పే స్వామికి కన్నడ భాష మీద స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో అతడు అక్కడే స్థిరపడ్డాడు. ఇల్లు కూడా కట్టుకున్నాడు. అయితే ఆ ఇద్దరు కూతుర్లలో చిన్న కూతురు వివాహం ఇటీవల నిశ్చయమైంది. అయితే ఆ వివాహానికి దిన్నే హట్టి ప్రాంతానికి చెందిన చిన్ననాటి స్నేహితుడికి ఆ పెళ్లి కార్డును పంపించాడు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోటపడి తిప్పేస్వామి మొదటి భార్యకు తెలిసింది. ఆమె కుమారుడికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో వారు ఆ పెళ్లి కార్డును పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కర్ణాటక వెళ్ళిపోయారు. అక్కడి పోలీసుల సహాయంతో తిప్పేస్వామిని ఆంధ్రకు తీసుకొచ్చారు. అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి సూచనల మేరకు జైలుకు తరలించారు.. అయితే తన చిన్న కుమారుడిని చంపిన తర్వాత తిప్పే స్వామి కర్ణాటక వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా అతని ఆచూకీ లభించకపోవడంతో.. చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇన్నాళ్లకు పెళ్లి కార్డు ద్వారా అతడి ఆచూకీ లభించడం.. జైలుకు వెళ్లడంతో.. తిప్పే స్వామి మొదటి భార్య హర్షం వ్యక్తం చేస్తోంది. తన చిన్న కుమారుడి ఆత్మకు ఈరోజు శాంతి కలిగిందని వ్యాఖ్యానిస్తోంది. మొత్తంగా ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించింది.