Crime News : అది ప్రకాశం జిల్లా.. మార్కాపురం మండలం.. కోమటికుంట.. ఆ కుంట పక్కన స్త్రీ, పురుషుల మృతదేహాలు పడి ఉన్నాయి. ఉదయం అటువైపుగా వెళ్లిన కొంతమంది చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చారు. అక్కడి పరిస్థితిని చూసి హత్య కాదు, ఆత్మహత్య చేసుకున్నారనే నిర్ధారణకు వచ్చారు. అక్కడ సమీపంలో ఒక పురుగుల మందు డబ్బా కనిపించింది. దీంతో వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. దీంతో అసలు ఏం జరిగిందనేది.. పోలీసులు విచారణ చేస్తే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లిలో పోతిరెడ్డి సత్యనారాయణరెడ్డి (25) అనే యువకుడు తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. ఒక మోస్తరు చదువులు చదివిన అతడు.. ఇంటి వద్ద వ్యవసాయం చూసుకుంటూ.. ఇతర పనులకు వెళ్తుంటాడు. ఇతడికి భూలక్ష్మి (పేరు మార్చాం) (35) అనే వివాహితతో పరిచయం ఏర్పడింది.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలుగా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. భర్త లేని సమయంలో భూలక్ష్మి తన ఇంటికి సత్యనారాయణ రెడ్డిని పిలిపించుకునేది. అతనితో శారీరకంగా కలిసేది. భూలక్ష్మికి భర్త పోలిరెడ్డి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయినప్పటికీ ఆమె సత్యనారాయణ రెడ్డి తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
వీరి వ్యవహారం పోలిరెడ్డికి తెలిసింది. దీంతో భూలక్ష్మిని అతడు మందలించాడు. వ్యవహారం మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె అదే తీరు కొనసాగిస్తోంది. మరోవైపు పోతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వివాహం చేసుకుందామని భూలక్ష్మిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఈనెల 5న సత్యనారాయణ రెడ్డి తో కలిసి భూలక్ష్మి గ్రామం నుంచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో పోలిరెడ్డి పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే కోమటికుంట సమీపంలో భూలక్ష్మి, సత్యనారాయణ రెడ్డి విగత జీవులుగా పడి ఉండటం.. ఆ సమాచారం స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో.. వారు లోతుగా విచారణ చేశారు. ఫలితంగా అసలు విషయం వెలుగు చూసింది. భూలక్ష్మి మృతదేహాన్ని చూసేందుకు పిల్లలు ఇష్టపడలేదని సమాచారం. భర్త కూడా ముఖం చాటేయడంతో, ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు సత్యనారాయణ రెడ్డి మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన పుచ్చకాయలపల్లిలో చర్చనీయాంశంగా మారింది.