https://oktelugu.com/

Jainur: ఒక్క అత్యాచారం.. ఆదివాసీ జిల్లాను అట్టుడికేలా చేసింది.. కర్ఫ్యూకు కారణమైంది.. అసలేమైందంటే?

గోండు బెబ్బులి కుమురం భీం పుట్టిన జిల్లా అది. 80 శాతం ఆదివాసీలే. అన్యం పుణ్యం ఎరుగని అడవి బిడ్డలే. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులే వారి జీవనాధారం. వర్షాలు, పిడుగులతో అతలాకుతలం అయ్యే జిల్లా ఇప్పుడు దాడులతో అట్టుడుకుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 6, 2024 / 02:30 PM IST

    Jainur

    Follow us on

    Jainur: మొన్న కోల్‌కతా, నిన్న థానే.. ఇప్పుడు ఆసిఫాబాద్‌.. రాష్ట్రాలు వేరైనా జరిగింది మాత్రం ఒక్కటే. మహిళలపై లైంగిక దాడి. నేరస్తులకు కఠిన శిక్షలు విధిస్తున్నార మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడది అయితే చాలు అనుభవించాలి అన్నట్లుగా పశువులకన్నా హీనంగా తయారవుతున్నారు. చిన్న పిల్లలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా చెరబడుతున్నారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసినా.. పోలీసులు ఎన్‌కౌంటర్లు చేస్తున్నా కామాంధుల తీరు మారడం లేదు. తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లాలోని జైనూరు మండలంలో రాఖీ పౌర్ణమి నాడు ఆదివాసీ మహిళపై మగ్దూం అనే యువకుడు లైంగికదాడి చేశాడు. అనంతరం తీవ్రంగా కొట్టాడు. స్పృహ తప్పిన తర్వాత చనిపోయిందని రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. గుర్తు తెలియన వాహనం ఢొకొదని భావించిన ఆదివాసీలు ఆమెను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారం తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పడంతో ఆదివాసులు ఆగ్రహించారు. ఆదివాసీ, గిరిజన సంఘాలు బుధవారం బంద్‌ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో స్థానికంగా అల్లర్లు చెలరేగాయి. నిందితుడు ముగ్దుం ఆటో డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. అయితే సదరు మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసేందుకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తుంది.

    సెప్టెంబర్‌ 1న ఫిర్యాదు..
    ఇదిలా ఉంటే.. స్పృహలోకి వచ్చిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్‌ 1న బాధితురాలి తమ్ముడు నిందితుడిపై సిర్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై అత్యాచారయత్నం, హత్యతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనను ఖండిస్తూ ఆదివాసీ సంఘాలు బుధవారం బంద్‌ చేపట్టగా..స్థానికంగా అల్లర్లు చెలరేగాయి. పలు దుకాణాలపై దాడులు చేయడంతోపాటు కార్లను ధ్వంసం చేశారు.

    కర్ఫ్యూ విధింపు..
    జైనూరులో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. జైనూరులో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంటర్నేట్‌ సేవలను నిలిపివేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావారణం రాళ్ల దాడి జరగడంతో పలువురికి గాయాలు అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి వెయ్యి మంది పోలీసులు దిగారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పోలీసు పహారాలోనే ఉంది. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.