Crime News : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద ఫోన్ ఉంది. అయితే ఇందులో స్మార్ట్ ఫోన్ వాడేవారు చాలా ఎక్కువ. అందులో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ లో నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. ఇతర యాప్స్ లలో మనకు కావలసిన పనులను చక్కబెట్టుకోవచ్చు. యూట్యూబ్లో కులాసాగా వీడియోలు చూసుకోవచ్చు. అయితే తమ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గోల చేస్తున్నారని.. వారి గోలను నియంత్రించేందుకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. మొదట్లో వారు కిడ్స్ వీడియోస్ చూసేవాళ్ళు. ఆ వీడియోస్ చూస్తూ సందడి చేసేవాళ్లు. ఫలితంగా వారి వారి ఇళ్లల్లో గోల తగ్గిపోయింది. ప్రశాంతంగా ఉందనుకుని వాళ్ల తల్లిదండ్రులు భావించారు. కానీ అక్కడే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పెద్దలు తమ చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడంతో ఆ పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసి రకరకాల వీడియోలు పెట్టారు. అందులో మందు పాతరలు తయారు చేయడం ఎలా? అని యూట్యూబ్లో టైప్ చేసి.. ఆ వీడియోలో చూపించినట్టు ఆ పిల్లలు కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. అలా మందు పాతరలు తయారుచేసి ప్రయోగించడం మొదలుపెట్టారు. అయితే అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో ఆ పిల్లలు గాయపడ్డారు. బీహార్ రాష్ట్రంలో ముజఫర్ పూర్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలు గాయపడటంతో కంగారుపడిన తల్లిదండ్రులు వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వారికి చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసుల దాకా వెళ్ళింది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.. ఆ పిల్లలు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు..
అయితే ఆ పిల్లలు మందు పాతరల తయారీ మాత్రమే కాకుండా.. ఇంకా రకరకాల వీడియోస్ చూసినట్టు ఆ స్మార్ట్ ఫోన్లో బ్రౌజింగ్ హిస్టరీ చూస్తే తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. “పిల్లలు గాయపడినట్లు మాకు సమాచారం అందింది. మొదట్లో ఇది సాధారణ సంఘటన అనుకున్నాం. కానీ లోతుగా పరిశీలిస్తే మందు పాత్రల తయారీ వల్ల ఆ పిల్లలు గాయపడ్డారని తెలిసింది. కొద్దిరోజులుగా పిల్లలు మందు పాతరలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా రకరకాల వస్తువులను వారు సేకరించారు. వారికి ఆ వస్తువులు ఎవరిచ్చారో తెలియడం లేదు. పిల్లలు అడిగినా కూడా సమాధానం చెప్పడం లేదు. అయితే పసిపిల్లలకు ఇలాంటి ఆలోచనలు రావడం బాధ కలిగిస్తోంది. ఇప్పటికైనా పెద్దలు స్మార్ట్ ఫోన్ లను పిల్లలకు ఇవ్వకపోవడం మంచిది. వారు గోల చేస్తుంటే సమీపంలో ఉన్న పార్కులకు తీసుకెళ్లాలి. అంతేగాని ఇలా ఫోన్లు ఇస్తే లేనిపోని అనర్ధాలు జరుగుతాయి. అది అంతిమంగా సమాజం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని” పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులను ఆదేశించారు. అయితే ఇందులో గాయపడిన పిల్లలు ప్రస్తుతం కోలుకుంటున్నారని.. అక్కడ మీడియాలో ప్రసారమవుతున్న వార్తలు ద్వారా తెలుస్తోంది. గాయపడిన పిల్లల వయసు 10 సంవత్సరాలలోపే ఉంటుంది. వీరంతా కూడా నాలుగు, 5 తరగతులను స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు.
యూట్యూబ్లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు.. అవి పేలడంతో పిల్లలకు గాయాలు
బీహార్ – ముజఫర్‌పూర్‌లో కొంత మంది పిల్లలు యూట్యూబ్లో వీడియోలు చూసి బాంబులు తయారు చేశారు.. అయితే అవి ఒక్కసారిగా పేలడంతో పిల్లలకు గాయాలయ్యాయి
వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. pic.twitter.com/dG4i8xeOjr
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More