Badvel inter student case : ఈ కేసును దర్యాప్తు చేయడానికి హోంశాఖ ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంచలన విషయాలను వెల్లడించారు. బాధిత బాలిక (16) తో విగ్నేష్ (నిందితుడు) కు ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. విగ్నేష్ కడప జిల్లాలోని హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. విగ్నేష్ కు ఆరు నెలల క్రితం వివాహం అయింది. ప్రస్తుతం అతని భార్య గర్భిణి. గత శుక్రవారం విగ్నేష్ ఆ విద్యార్థినికి ఫోన్ చేసి కలవాలని కోరాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక శనివారం తాను చదివి కాలేజీ నుంచి ఆటోలో బయలుదేరింది. అయితే ఆ ఆటో పాలిటెక్నిక్ కాలేజీ వద్దకు రాగానే అందులో విగ్నేష్ ఎక్కాడు. వారిద్దరూ బద్వేల్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వద్ద దిగారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లారు. అనంతరం వారిద్దరు ఏకాంతంగా గడిపారు.. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం వారిద్దరు శృంగారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బాలిక తనను పెళ్లి చేసుకోవాలని విగ్నేష్ ను నిలదీసింది. దానికి విగ్నేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె తీరుపై మండిపడ్డాడు. కోపం తట్టుకోలేక తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసాడు. అయితే అతడు తెచ్చిన పెట్రోల్ ను ఆ బాలిక గమనించలేకపోయింది. అతడికి సిగరెట్లు తాగే అలవాటు ఉండడంతో.. లైటర్ ద్వారా ఆమె చున్నీ కి అంటించాడు.
మంటలు అంటుకోవడంతో..
బాలికకు మంటలు అంటుకోవడంతో ఆమె కేకలు వేసింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ బాలిక ను రిమ్స్ లో చేర్పించారు. ఈ ఘటన మీడియాలో ప్రముఖంగా ప్రచారం కావడంతో సంచలనం సృష్టించింది. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి.. నిందితుడిని వెంటనే పట్టుకొని.. అతనిపై కఠినమైన చర్యలు తీసుకునేలాగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ బాలిక కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల 30 నిమిషాలకు కన్ను మూసింది. అయితే కొంతకాలంగా తనని పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక విగ్నేష్ ను కోరుతుండడంతో.. తట్టుకోలేక ఆమెను ఏదో ఒకటి చేయాలనే పన్నాగంతోనే విగ్నేష్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కడప నగరం నుంచి వస్తున్నప్పుడే అతడు తన సంచిలో పెట్రోల్ బాటిల్ పెట్టుకొని బయలుదేరాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వాస్తవానికి కొంతకాలంగా విగ్నేష్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడని తెలుస్తోంది. ఆమె పెళ్లి చేసుకోవాలని పదేపదే కోరుతుండటం వల్లే విగ్నేష్ ఈ దారుణానికి ఒడికట్టాడని తెలుస్తోంది. కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ.. ఇటీవల దగ్గరయ్యారని.. మళ్లీ ఆ బాలిక పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో విగ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వెల్లడించారు. మరో వైపు ఆ బాలిక ఆసుపత్రి బెడ్ పై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూనే.. అడవిలో విగ్నేష్, తన మధ్య జరిగిన సంఘటనను మొత్తం వెల్లడించింది. తన ప్రాణాలు పోవడానికి కారణమైన విగ్నేష్ ను కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. ఆ వీడియో ఇటీవల మీడియాలో సంచలనంగా మారింది. మరోవైపు ఆ బాలిక తల్లి కూడా.. తన కూతురు మరణానికి కారణమైన విగ్నేష్ ను కూడా పెట్రోల్ పోసి కాల్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది.