Road Accident: వారంతా సమీప గ్రామాలకు చెందినవారు.. వ్యక్తిగత పనుల మీద సమీప పట్టణాలకు వెళ్లి వస్తున్నారు. ఇళ్లకు వెళ్లే క్రమంలో.. ఆటో ఎక్కారు. ఆటో కూడా వేగంగా వెళ్తోంది. మరి కాసేపైతే వారు వారి గ్రామాలకు చేరుకునేవారు. కానీ ఈలోగా అనుకోని ప్రమాదం కొందరిని విగత జీవులుగా చేస్తే.. మరికొందరిని క్షతగాత్రులుగా మార్చింది. ఈ దారుణ సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ” వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి-563″ పై జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనం, పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
తొర్రూర్ పట్టణం నుంచి ఐదుగురు ప్రయాణికులతో ఓ ఆటో దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం బయలుదేరింది. బీరి శెట్టి గూడెం శివారు ప్రాంతంలోకి చేరుకున్న తర్వాత.. అక్కడ రోడ్ల మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో.. మూడు కిలోమీటర్ల మేర స్థానిక కాంట్రాక్టర్ రోడ్డును తవ్వాడు. ఆ రోడ్డు పై ప్రయాణిస్తున్న నేపథ్యంలో గుంతలు ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ ఆటోను తప్పించేందుకు కుడివైపు డ్రైవ్ చేశాడు. ఇంతలోనే మరిపెడ నుంచి దంతాలపల్లి వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో భారీ శబ్దం వినిపించింది. ఈ శబ్దం తీవ్రతకు కిలోమీటర్ దూరంలో ఉన్నవారు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఆటో రెండు ముక్కలుగా విడిపోయింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.
ఇక ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న బీరి శెట్టి గూడెం గ్రామానికి చెందిన పగిండ్ల కుమార్, వాల్య తండాకు చెందిన భుక్య నరేష్, ఆటో డ్రైవర్ బందు మల్లేష్ అక్కడికక్కడే చనిపోయారు.. ఆటోలో ప్రయాణిస్తున్న కుమార్ భార్య మంజుల, ఆమె కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఆమనగల్లు ప్రాంతానికి చెందిన మరో మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.. అయితే కుమార్ భార్య మంజుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని 108, పోలీస్ పెట్రోలింగ్ వాహనాలలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.. మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.