Pune Pregnant Job Offer: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కామర్లు కొత్త కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఏ స్థాయిలో అవగాహన కల్పించినప్పటికీ.. స్కామర్లు కొత్త కొత్త విధానాలలో ఆర్థిక నేరాలకు ఒడిగడుతున్నారు. గతంలో మీ పేరు మీద నిషేధిత వస్తువులు వచ్చాయని.. మీకు విదేశాల నుంచి బంగారం లేదా ఇతర పార్సిల్లు వచ్చాయని.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని.. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. మొబైల్ నెంబర్ కు మెసేజ్ పంపించి ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని.. చూస్తుండగానే ఖాతాను మొత్తం కొల్లగొట్టేవారు. ఈ తరహా మోసాలపై పోలీసులు అవగాహన కల్పించిన నేపథ్యంలో ప్రజలు కాస్త జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు దోచుకోవడానికి స్కామర్లు కొత్త విధానాలకు రూపకల్పన చేశారు. అందులో ఈ తరహా మోసం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
“నాకు వివాహం జరిగింది. భర్త నపుంసకుడు. నాకు కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉంది. నాకు ఐవీఎఫ్, ఫెర్టిలిటీ ద్వారా సంతానం పొందాలనే కోరిక లేదు. చివరికి సరోగసి కూడా అవసరం లేదు. నన్ను తల్లిని చెయ్యగలిగే పురుషుడు కావాలి. నన్ను తల్లిని చేస్తే 25 లక్షలు చెల్లిస్తాను” అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ సర్కులేట్ అవుతోంది.. అయితే ఈ వీడియో నిజమైన నమ్మిన ఓ వ్యక్తి నిండా మోసపోయాడు.
మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన 44 సంవత్సరాల కాంట్రాక్టర్ ఆ వీడియో లో మహిళ చెప్పిన మాటలు మొత్తం నిజమైన నమ్మాడు. ఆ వీడియో లో ఆ మహిళ పేర్కొన్న నంబర్ కు ఫోన్ చేశాడు. అతడితో వారంతా రిజిస్ట్రేషన్ ఫీజు, వెరిఫికేషన్ చార్జీలు, జీఎస్టీ, టీడీఎస్ పేరుతో భారీగా చెల్లింపులు చేయించుకున్నారు.. గడిచిన సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు 11 లక్షలు అతడి వద్ద వసూలు చేశారు. ఆ తరువాత ఎంత సేపటికీ ఫోన్ ఎత్తలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి.. పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో వారు అతడు అందించిన వివరాల కేసు నమోదు చేశారు.
వాస్తవానికి ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అయితే చాలామంది వీటిని నిజం అనుకొని భావిస్తున్నారు. అంతే కాదు.. మోసగాళ్ళు చెప్పిన నంబర్లకు డబ్బు పంపిస్తూ నిండా మునుగుతున్నారు. ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.