Maharashtra : కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన మరువక ముందే మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక దాడి ఘటన సంచలనంగా మారింది. మహారాష్ట్ర లోని థానే జిల్లా బద్లాపూర్ పట్టణంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై స్వీపర్ లైంగికదాడి ఘటన సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ చిన్నారులపై అఘాయిత్యం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల పిల్లలు తీవ్ర నొప్పితో బాధపడుతుండగా, తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. వారు తమకేమి తెలువదని బుకాయించారు. ఇక విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. ఆందోళనలు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వీపర్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. పాఠశాల యాజమాన్యం కేవలం క్షమాపణలు చెప్పి, తమ బాధ్యత కాదన్నట్లు ప్రవర్తించడంపై నిరసన కారులు మండిపడ్డారు. ప్రస్తుతం నిరసనకారుల ఆందోళనలతో బద్లాపూర్ అట్టుడుకుతున్నది. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా నేతలు దాడికి దిగారు. ఇక బద్లాపూర్ రైల్వే స్టేషన్ పట్టాలపై ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం 5 వరకు రైళ్లు స్టేషన్ లోనే వేచిచూస్తున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇక పట్టణంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా సీఎం ఏక్ నాథ్ షిండే ఈ ఘటన పై ఆరా తీశారు. పోలీస్ , ఇతర శాఖల అధికారుల ద్వారా వివరాలు తెప్పించుకున్నారు. బద్లాపూర్ లో ఉన్న ఉన్నతాధికారులతో మంత్రులు పలుమార్లు మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వీపర్ పైనే ఆరోపణలు
కాగా, ఈ నెల 12, 13 తేదీల్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తున్నది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆగ్రహానికి లోనై, పాఠశాలపై దాడికి యత్నించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని వర్గాల పిలుపు మేరకు బద్లాపూర్ లో మంగళవారం బంద్ పాటించారు. పెద్ద సంఖ్యలో వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
కోల్ కతా వైద్యురాలి ఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా ఈ ఘటన పెను సంచలనమైంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపై కి చేరారు. థానే రోడ్లు, రైల్వే స్టేషన్ జన దిగ్బంధంలో ఉండిపోయింది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను బద్లాపూర్ వ్యాప్తంగా మోహరించారు. అదనపు బలగాలను రప్పించారు. నిరసనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం ఏక్ నాథ్ ఆదేశాలు
ఇక బద్లాపూర్ ఘటనపై సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు వెంటనే విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. పాఠశాల ఘటనపై సిట్ ను ఏర్పాటు చేస్తూ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. ఐజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్తి సింగ్ సారథ్యంలోని బృందం వెంటనే రంగంలోకి దిగింది. బద్లాపూర్ కు చేరుకుంది. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు ఉంచాలని థానే పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. దోషులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు.