Prakasam District Sasikala Case: కొన్ని సందర్భాలలో దారుణమైన నేరాలు జరుగుతుంటాయి. నేరస్తులు ఒక చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్త పడుతుంటారు.. ఇలాంటి కేసులు చేధించడానికి పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.. వారి ప్రయత్నాలు ఏమాత్రం సఫలీకృతం కాదు. పైగా అడుగడుగున అడ్డంకులు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ.. చివరికి కేసును సాల్వ్ చేస్తే.. దోషులను పట్టుకుంటే పోలీసులకు లభించే ఆనందం మామూలుగా ఉండదు.
ప్రపంచంలోనే అత్యంత తెలివైన పోలీసులుగా అమెరికన్ కాప్స్ కు పేరుంది. వారిని కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఓ నేరస్థుడు. ఇతడు భారతదేశానికి చెందినవాడు. అమెరికాలోని న్యూ జెర్సీ ప్రాంతంలో ఉన్న కాగ్నిజెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన శశికళ దంపతులు కూడా అక్కడ పనిచేస్తున్నారు. శశికళ దంపతులు, హమీద్ ఒకటే అపార్ట్మెంట్లో ఉండేవారు. ఒక చిన్న విషయం మీద శశికాల భర్త హనుమంతుకు, హమీద్ కు గొడవ జరిగింది. అది కాస్త పెద్దదిగా మారింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా హనుమంతు, శశికళ మీద హమీద్ పగ పెంచుకున్నాడు. ఒకరోజు ఆఫీస్ కు అకారణంగా సెలవు పెట్టాడు.. హనుమంతు యధావిధిగా కార్యాలయానికి వెళ్ళాడు. హమీద్ ఇంట్లోకి ప్రవేశించి శశికళ, ఆమె ఏడు సంవత్సరాల కుమారుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. కనీసం ఒక ఆధారం కూడా పోలీసులకు దొరకకుండా అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
పోలీసులు ముందుగా ఈ కేసులో శశికళ భర్తను అనుమానించారు. అతడిని విచారించారు. అతడు ఈ దారుణానికి పాల్పడలేదని నిర్ధారించుకున్న తర్వాత వదిలేశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా అక్కడ ఒక చిన్న రక్తపు మరక కనిపించింది. అది పోలీసులకు అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో ఆ రక్తపు ఆనవాళ్లను పోలీసులు సేకరించారు. శశికళ, ఆమె కుమారుడి డిఎన్ఏ తో ఆ రక్తం మ్యాచ్ కాలేదు. దీంతో పోలీసులకు చిన్నపాటి బ్రేక్ సాధించారు. అయితే ఇది ఎవరిదో తెలుసుకోవడానికి మళ్లీ వారు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారిని పోలీసులు ప్రశ్నించగా హమీద్ తో శశికళ కుటుంబానికి ఉన్న గొడవ గురించి తెలిసింది. అప్పటికే హమీద్ అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీంతో అప్పటినుంచి హమీద్ గురించి పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఇక తర్వాత మూడు పర్యాయాలు ఇండియన్ పోలీసులకు లేఖలు రాశారు. హమీద్ డీఎన్ఏ శాంపిల్స్ కావాలని వారు రిక్వెస్ట్ లెటర్స్ రాశారు. దానికి ఇండియన్ పోలీసులు అంతగా రెస్పాండ్ కాలేదు. పైగా డిఎన్ఏ శాంపిల్స్ ఇవ్వడానికి హమీద్ ఒప్పుకోవడం లేదని వారు అమెరికన్ పోలీసులకు లెటర్లు రాశారు.
ఈ క్రమంలో అమెరికన్ పోలీసులు ఒక వినూత్నమైన ప్రణాళిక రూపొందించారు. హమీద్ పని చేస్తున్న కాగ్నిజెంట్ కంపెనీని అప్రోచ్ అయ్యారు. అసలు విషయం చెప్పడంతో వారు హమీద్ వాడిన లాప్టాప్ ను అమెరికన్ పోలీసులకు ఇచ్చారు. దీంతో ఫోరెన్సిక్ అధికారుల సహాయంతో ల్యాప్టాప్ నుంచి హమీద్ డిఎన్ఎ ను సేకరించారు. గతంలో వారు సేకరించిన డిఎన్ఏ తో పోల్చి చూస్తే అది మ్యాచ్ అయింది. దీంతో ఈ దారుణానికి పాల్పడింది హమీద్ అని పోలీసులు నిర్ధారించారు..
ఇంతటి దారుణానికి పాల్పడిన హామీద్ ను తమకు అప్పగించాలని ఇండియన్ పోలీసులను అమెరికన్ పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఇండియన్ పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది. మరోవైపు 2017లో ఈ దారుణం జరిగితే 8 సంవత్సరాలు పాటు అమెరికా పోలీసులు దర్యాప్తు చేశారు. చిన్న ఆధారాన్ని పట్టుకొని కేసును పరిష్కరించారు.