spot_img
Homeక్రైమ్‌PMJ Jewellery Robbery Karimnagar: రిక‘వర్రీ’.. కరీంనగర్‌ పోలీసులకు సవాల్‌గా మారిన పీఎంజే కేసు!

PMJ Jewellery Robbery Karimnagar: రిక‘వర్రీ’.. కరీంనగర్‌ పోలీసులకు సవాల్‌గా మారిన పీఎంజే కేసు!

PMJ Jewellery Robbery Karimnagar: కరీంనగర్‌ జ్యోతినగర్‌లోని ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌పై జరిగిన భారీ దోపిడీ కేసు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఘటన జరిగి దాదాపు 40 రోజులు అయినా చోరీ అయిన వజ్రాలు, బంగారు ఆభరణాల ఆచూకీ ఇప్పటికీ పూర్తిగా లభ్యం కాలేదు. సాధారణ దోపిడీ కేసుల్లో కొద్ది రోజుల్లోనే సొత్తు రికవరీ అయ్యేవి, కానీ ఈ కేసు పూర్తి వ్యతిరేక దిశలో సాగుతోంది.

గ్యాంగ్‌స్టర్‌ సుబోధ్‌ సింగ్‌ అరెస్ట్‌..
ఈ దోపిడీ కేసులో కీలక నిందితుడిగా పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ సుబో«ద్‌సింగ్‌ అని గుర్తించారు. ఇటీవలే అతడిని అరెస్టు చేసి కరీంనగర్‌కు తీసుకొచ్చారు. అతనితోపాటు ఇతర నిందితులు కూడా విచారణలో పరస్పరం విరుద్ధమైన వాదనలు చెబుతున్నారు. ఒకరు ఒక విషయం చెప్పగా, మరొకరు దానికి పూర్తి వ్యతిరేకంగా సమాధానాలు ఇవ్వడం పోలీసులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. ఈ విరుద్ధ సమాధానాలు సహజమైనవా లేదా నిందితులు కావాలని పోలీసులను తప్పుదారి పట్టించడానికి చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నమా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. గ్యాంగ్‌స్టర్‌ నేతృత్వంలోని ఈ బృందం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధమై ఉండవచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

క్లిష్టంగా మారిన దర్యాప్తు..
పీఎంజే కేసు దర్యాప్తు సాధారణ దొంగతనం కంటే చాలా క్లిష్టంగా మారింది. దోపిడీ జరిగిన వెంటనే సొత్తును వేర్వేరు చోట్లకు తరలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తర్వాత ఆభరణాలను కరిగించి వేరే రూపంలో మార్చడం లేదా ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించడం జరిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిందితుల మధ్య ఉన్న విరుద్ధ వాదనలు నిజమైన సమాచారాన్ని బయట పెట్టడం లేదు. సైంటిఫిక్‌ ఫారెన్సిక్‌ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ లోతైన విశ్లేషణ, ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్, సాంకేతిక పర్యవేక్షణ వంటి అధునాతన పద్ధతులు తప్పనిసరి అవుతున్నాయి.

పోలీసులకు సవాల్‌..
ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. సుబోధ్‌ సింగ్‌ ఇప్పటికే అనేక ఇతర కేసుల్లో ప్రమేయం ఉన్న గ్యాంగ్‌స్టర్‌ కావడంతో దోపిడీ వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు కేవలం నిందితుల వాదనలపైనే ఆధారపడకుండా మరింత లోతైన విచారణ జరపాల్సి ఉంది. సొత్తు రికవరీలో ఆలస్యం జరిగితే నేరస్తులకు ధైర్యం పెరిగి, ఇలాంటి భారీ దోపిడీలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

పోలీసులు ఈ విరుద్ధ సమాచారాలను అధిగమించి, నిజమైన సొత్తు ఆచూకీని త్వరగా గుర్తించి రికవరీ చేయగలరా అనేదే ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం. దర్యాప్తు ఎంత సమర్థవంతంగా, ఎంత త్వరగా ముగుస్తుందో అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version