Mummy Just Watched: ఇటీవల కాలంలో మనదేశంలో వివాహేతర సంబంధాలు, వాటి వల్ల జరిగే ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఇటువంటి దారుణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘోరమే రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వివాహిత తన భర్తను ఇతర వ్యక్తులతో కలిసి అంతం చేసిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఆ వివాహిత కుమారుడు పోలీసుల ఎదుట ధైర్యంగా సాక్ష్యం చెప్పడంతో ఆమె చేసిన దారుణం బయటపడింది. పోలీసులకు అతడు ఈ విషయం చెప్పడంతో అమ్మగారు కటకటాల వెనక్కి వెళ్ళిపోయారు. జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా ఖేర్లీ పట్టణంలో ఈ నెల ఏడున ఓ వ్యక్తి దారుణంగా హతమయ్యాడు. హతమైన ఆ వ్యక్తి పేరు వీరు జాతవ్.. అతడికి అనిత అనే భార్య ఉంది. వీరు, అనిత ఖేర్లీ పట్టణంలో నివాసం ఉంటున్నారు. అనిత ఓ కిరాణం షాప్ నడుపుతోంది. వీరు వివిధ వేడుకలకు వంట సామగ్రిని కిరాయికి ఇచ్చే దుకాణం నిర్వహిస్తున్నాడు.
Also Read: Honeymoon Plan Gone Wrong: హనీ మూన్ కు నవ వరుడు ప్లాన్.. వెళ్తే మరో మేఘాలయ అయ్యేది!
ఆ పరిచయం కాస్త..
అనిత నిర్వహించే జనరల్ స్టోర్ కు దగ్గరగానే శ్రీరామ్ అనే వ్యక్తి స్నాక్స్ అమ్ముతూ ఉండేవాడు. శ్రీరామ్, అనితకు పరిచయం ఏర్పడింది. మొదట్లో అతడు ఆమెకు స్నాక్స్ తెచ్చి ఇచ్చేవాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వాస్తవానికి అనితకు, వీరు దంపతులకు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అతడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుతున్నాడు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి అనిత శ్రీరామ్ తో సాన్నిహిత్యం పెంచుకుంది. దీనితో వారిద్దరూ కలిసి ఉండాలని భావించారు. ఇందులో భాగంగానే తమకు అడ్డుగా ఉన్న వీరును తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వీరును అంతం చేయడానికి కుట్రపన్నారు. వీరును భూమి మీద లేకుండా చేయడానికి కాశీరామ్ అనే వ్యక్తికి రెండు లక్షలు చెల్లించారు. మరో నలుగురు వ్యక్తులను కూడా ఈ దారుణం చేయడానికి మాట్లాడుకున్నారు. ఈనెల 7న రాత్రి వీరును అంతం చేశారు. ఆ తర్వాత ఆ సమాచారాన్ని అనితకు చెప్పారు. దీంతో అనిత వీరు వదినకు ఫోన్ చేసింది. తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావిస్తుండగా చనిపోయాడని చెప్పింది. దీంతో బంధువులు నమ్మారు. అయితే వీరు అలా చనిపోవడాన్ని అతడి సోదరుడు నమ్మలేకపోయాడు. అనేక అనుమానాలు వ్యక్తం చేసి పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుపట్టాడు. దీనికి మొదట్లో అనిత ఒప్పుకోలేదు. ఆ తర్వాత బంధువులు ఒత్తిడి చేయడంతో పోస్టుమార్టం నిర్వహించక తప్పలేదు. పోస్టుమార్టం లో అతని గొంతును కోసి చంపినట్టు నిర్ధారణ అయింది. నీతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అనిత కుమారుడు ఏం చెప్పాడంటే..
పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. కాల్ డాటా పరిశీలించారు. ఈ క్రమంలో వీరు కుమారుడిని విచారించారు. దీంతో అతడు జరిగింది మొత్తం చెప్పాడు..” ఆరోజు రాత్రి మా నాన్న ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చాడు. భోజనం చేసి పడుకున్నాడు. కొంతసేపటికి శ్రీరామ్ అంకుల్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మరో నలుగురు కూడా మా ఇంట్లోకి ప్రవేశించారు. మంచం కదులుతుంటే శబ్దం వినిపించింది. లేచి చూడగానే శ్రీరామ్ అంకుల్ మా నాన్న ముఖాన్ని దిండుతో నొక్కాడు. ఆ సమయంలో మా అమ్మ అక్కడే ఉంది. నేను ఆపడానికి వెళ్తే శ్రీరామ్ అంకుల్ వద్దని వారించాడు. నన్ను ఎత్తుకొని నిశ్శబ్దంగా ఉండాలని బెదిరించాడు. కొంచెం సమయం గడిచిపోగానే మా నాన్న కదలడం ఆగిపోయింది. మా అమ్మ అస్సలు మంచిది కాదు..ఆమె వల్లే మా నాన్న దూరమయ్యాడు” అని తొమ్మిది సంవత్సరాల బాలుడు పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు అనిత, శ్రీరామ్, మిగతా నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు.