Mother Kills Daughter: మూఢనమ్మకం ఎప్పటికైనా ప్రమాదమే. దానివల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతుంటాయి. వెనుకటి కాలంలో మూఢనమ్మకాలను జనాలు నమ్ముతుండేవారు. ఆ అపనమ్మకాల ఆధారంగా అడ్డమైన పనులు చేస్తూ ఉండేవారు. దీనివల్ల ప్రాణ నష్టం తీవ్రంగా జరుగుతూ ఉండేది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత మూఢనమ్మకాలను విశ్వసించడం తగ్గిపోయింది. అయితే నేటి ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. అందులోనూ చదువుకున్నవారు మూఢనమ్మకాలను పాటిస్తుండడం అత్యంత విషాదం. అలా ఓ మూఢనమ్మకాన్ని పాటించిన ఓ మహిళ దారుణాతి దారుణమైన నిర్ణయం తీసుకొని.. అందరికీ శోకాన్ని మిగిల్చింది.
అన్ని శునకాల వల్ల రేబిస్ రాదు..
శునకాల వల్ల రేబిస్ సోకుతుంది. అయితే రేబిస్ వచ్చిన శునకాల వల్ల మాత్రమే మనుషులకు ప్రమాదం. అన్ని శునకాలకు రేబిస్ ఉండదు. కాకపోతే సాధ్యమైనంతవరకు వాటికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ వాటి లాలాజలం మనకు తగిలినా.. కొన్ని సందర్భాలలో అవి రక్కినా వెంటనే ఇంజక్షన్ వేయించుకోవాలి. వెనుకటి రోజుల్లో అయితే ఇంజక్షన్లు అంతగా అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు విరివిగా మందులు లభిస్తున్నాయి కాబట్టి పెద్దగా ప్రమాదం లేదు. పైగా అత్యంత శక్తివంతమైన మందులు అందుబాటులోకి రావడంతో రేబిస్ అనే వ్యాధి కూడా మనదేశంలో నియంత్రణలో ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా పదుల సంఖ్య లోపే మనదేశంలో రేబిస్ కేసులు నమోదయ్యాయి.
రేబిస్ వచ్చిందని..
రేబిస్ సోకిన కుక్క కరిస్తే మనుషులకు రేబిస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఆరోగ్యవంతమైన కుక్క కరిచినా రేబిస్ రాదు. ఈ విషయం తెలియక ఓ మహిళ తీసుకున్న నిర్ణయం రెండు ప్రాణాలను బలి పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ అమానుషం చోటుచేసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా చెందిన యశోద అనే మహిళ మూడు సంవత్సరాల కూతురును చంపేసింది. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుంది.. ఇటీవల యశోద ఇంట్లో పల్లీలు ఆరబెట్టారు. వాటిని కుక్కలు తిన్నాయి. కొన్నింటిని అలానే మిగిల్చాయి. కుక్కలు తిన్న పల్లీలను విశాఖ కూతురు తిన్నది. దీంతో తన కూతురికి రేబిస్ సోకిందని. యశోద తన కూతురికి టీకాలు కూడా వేయించింది. అయినప్పటికీ తన కూతురికి రేబిస్ సోకి ఉంటుందని యశోద అనుమానించింది. ఆ అనుమానంలోనే తను మతిస్థిమితం కోల్పోయింది. అంతే పాపను చంపి.. తను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని యశోద భర్త మీడియాకు చెప్పుకుంటూ బోరున విలపించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పాలమూరు జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.