Battula Prabhakar: బీఎండబ్ల్యూ, ఆడి వంటి కార్లలో తిరుగుతుంటాడు. ప్రతిరోజు పబ్బులకు, రెస్టారెంట్లకు వెళ్తుంటాడు. టిప్పులే వేల రూపాయలు ఇస్తుంటాడు. అలాగని అతడేమీ ఐటీ ఉద్యోగి కాదు. శ్రీమంతుడి కొడుకు అంతకన్నా కాదు. జస్ట్ ఓ దొంగ.. కాదు కాదు గజదొంగ. ఆ గజదొంగ పేరు భత్తుల ప్రభాకర్.. ఇటీవల గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బు సమీప ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళగా.. ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పోలీసులకు దొరికాడు. పోలీసులు అతడిని విచారిస్తుండగా విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
స్వస్థలం చిత్తూరు జిల్లా
బత్తుల ప్రభాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లె. అతడి తల్లి మరణించగా.. తండ్రి కృష్ణయ్య కటిక పేదరికంలో ఉన్నాడు. ప్రభుత్వం ప్రతినెల అతడికి పింఛన్ ఇస్తున్నది. అది సరిపోకపోతే ఒక్కొక్కసారి దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తుంటాడు.. కృష్ణయ్య కుటుంబం గతంలో గుంటూరు జిల్లా వలస వెళ్లింది. చిలకలూరిపేటలో కొద్ది రోజులు వారు పని చేశారు.. ప్రభాకర్ అక్కడే జన్మించాడు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి కృష్ణయ్య కుటుంబం మారింది.. ఆ తర్వాత కృష్ణయ్య స్వగ్రామానికి చేరుకున్నాడు.. ప్రభాకర్ గతంలో ఓ దొంగతనం కేసులో విశాఖ జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో ఒక నేరస్తుడితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రభాకర్ బయటకు వచ్చిన తర్వాత.. జైల్లో పరిచయమైన నేరస్తుడి (అతని కూడా అప్పుడు బయటకు వచ్చాడు) ద్వారా 10 లక్షల ఖర్చుతో బీహార్ నుంచి మూడు తుపాకులు, 500 బుల్లెట్లు తెప్పించుకున్నాడు.. తుపాకీ ఎలా కాల్చాలో నేర్చుకోవడానికి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు.. అతడు ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఓ కుక్కను కాల్చి చంపాడు.. ప్రభాకర్ కు వివాహం జరిగినప్పటికీ. భార్యతో కలిసి ఉండడం లేదు. గచ్చిబౌలిలో అతడు నివాసం ఉంటున్న ఫ్లాట్ కు అప్పుడప్పుడు కొంత మంది అమ్మాయిలను తీసుకొచ్చి జల్సా చేసేవాడు. ఇక ఇటీవల వేరే రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయిని తన ఫ్లాట్ కి తీసుకొచ్చి.. ఆమెతో ఉంటున్నాడు. అయితే దొంగతనం చేయగా వచ్చిన డబ్బును ఇతరుల ఖాతాల్లో వేసి.. వాటిని తన ఖాతాల్లోకి మళ్లించుకునేవాడు.. ఇక ఐదు కార్లను వేరువేరు వ్యక్తుల పేరు మీద కొనుగోలు చేశాడు. ఇటీవల బాగా మద్యం తాగి కారు నడిపాడు.. డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికిపోయి తన కారును అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు తన అనుచరులలో ఒకరికి లక్ష రూపాయలు ఇచ్చి కారు నడిపినట్టు పోలీసుల ముందు అంగీకరించాలని పంపించాడు. అయితే ఆ మోసాన్ని ట్రాఫిక్ పోలీసులు తిప్పికొట్టారు..
గోవాలో హోటల్ కట్టాలని..
ప్రభాకర్ ఎక్కువగా వేశ్యల వద్దకు వెళ్లేవాడు. అక్కడ వారి పేరు మీద సిమ్ కార్డులు తీసుకునేవాడు. ఇటీవల గోవా వెళ్లి వచ్చాడు. అక్కడ అతడు హోటల్ కట్టాలని నిర్ణయించుకున్నాడు.. ప్రభాకర్ దాదాపు 23 ఇంజనీరింగ్ కాలేజీల్లో దొంగతనాలు చేశాడు. ఆ దొంగతనాలకు ముందు ఉదయం పూట రెక్కి నిర్వహించాడు. మరోవైపు ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేయగా.. అతడికి సహకరిస్తున్న వారి గురించి కూడా ఆరా తీశారు. ప్రీజం పబ్బు వద్ద ప్రభాకర్ కాల్పులు జరిపినప్పుడు.. అతడిని రంజిత్, రోహిత్ అనే వ్యక్తులు స్కోడా కారు లో డ్రాప్ చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ప్రభాకర్ ఉదంతాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.