Woman elopes with Younger man: ఒక ఆడ, ఒక మగ మధ్య సంబంధం ఏర్పడే క్రమంలో వయసు అంతరం ఒక పరిధి వరకే ఉండాలి. అది దాటితే అది ఆడకైనా, మగ కైనా ఇబ్బందే. వెనుకటి రోజుల్లో పెళ్లిళ్లు చేసే క్రమంలో పెద్దలు వయసు అంతరాన్ని ఎక్కువగా ఉండకుండా చూసుకునేవారు. ఆరోజుల్లో బాల్య వివాహాలు జరిగినప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. కానీ, నేటి కాలంలో అలాంటి పరిస్థితి లేదు. వయసు అంతరంతో పని లేకుండానే సంబంధాలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాలలో అవి దారుణాలకు దారితీస్తున్నాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.
అది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం లోని జూబ్లీహిల్స్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆర్తి(46), ఆమె భర్త పాశ్వాన్ నివాసం ఉంటున్నారు. వీరిద్దరిది కూడా ఉత్తర భారత దేశంలో ఓ నగరం. చాలా సంవత్సరాల క్రితమే వీరు హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల ఆర్తి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇది పాశ్వాన్ లో అనుమానం కలిగించింది.
ఆర్తి తీరును పసిగట్టాలని భావించిన పాశ్వాన్ ఆమె కదలికలపై దృష్టి పెట్టాడు. ఇదే క్రమంలో ఆమె శ్రీధర్ (23) అనే వ్యక్తికి దగ్గర అయినట్టు గుర్తించాడు. శ్రీధర్ వయసు ఆర్తిలో సగం ఉంటుంది. అయినప్పటికీ అతడి మీద ఆమె మనసు పారేసుకున్నట్టు భర్త గుర్తించాడు. ఇదే విషయంపై ఆర్తిని నిలదీశాడు. దీంతో ఆమె పొంతన లేని సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలో భర్త ఆమెను ఈసారి మరింత తీవ్రంగా హెచ్చరించాడు. ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన పరిణామాలు ఉంటాయని చెప్పాడు. దీంతో ఆర్తి భర్త మీద కోపం పెంచుకుంది. అంతేకాదు శ్రీధర్ తో కలిసి వెళ్లిపోయింది.
భార్య ఆర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం.. ఆమెకు సంబంధించిన వస్తువులు కనిపించకపోవడంతో భర్త పాశ్వాన్ కు అనుమానం వచ్చింది. దీంతో అతడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. శ్రీధర్ అనే యువకుడి మీద తనకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో కూడా ఓ వివాహిత ఇలానే తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. చివరికి ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిద్దరిని కష్టపడి వెతికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వారిద్దరికీ పోలీస్ స్టేషన్ లోనే ఆ భర్త వివాహం చేయడం విశేషం.