Girlfriend Steals Watches For Birthday Gift: ప్రేమ గుడ్డిది అంటారు కదా .. ఈమె చేసిన వ్యవహారం తర్వాత అది నిజమే అనిపిస్తోంది. మామూలుగా అయితే ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది. ఇలా చేసేవారు జాబితాలో మగవాళ్లే అధికంగా ఉంటారు. కానీ మగవాళ్ళ డామినేషన్ ఏంటీ.. చరిత్రలో.. నిజ జీవితంలో ప్రేమించిన వాళ్ల కోసం మగవాళ్ళు మాత్రమే త్యాగాలు చేయాలా.. నేను చేస్తే తప్పా అన్నట్టుగా ముందుకొచ్చింది. కాకపోతే బిగినర్స్ మిస్టేక్స్ కావడంతో దొరికిపోయింది.
ఆ యువతకి పాతిక సంవత్సరాల వయసుంటుంది. ఖమ్మం జిల్లా ఆమె సొంత ఊరు. హైదరాబాదులో ఉంటోంది. అక్కడ ఏదో పని చేస్తోంది. హైదరాబాదులోనే ఖమ్మం జిల్లా చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల తన ప్రేమికుడి పుట్టినరోజు. ఏదైనా కానుక ఇవ్వాలని అతడిని ఒక వాచ్ షో రూమ్ కు తీసుకెళ్లింది. అక్కడ అన్ని రకాల మోడల్స్ చూసింది. పర్సులో డబ్బులు లేవు. ప్రేమికుడు దగ్గర బిల్డప్ ఇవ్వాలి.. ఇవన్నీ జరగాలంటే ఏదో ఒకటి చేయాలి. అదిగో అప్పుడే ఆమె బుర్రలో ఓ దిక్కుమాలిన ఐడియా మెదిలింది. అప్పటిదాకా దేవి సినిమాలో వనితలాగా ఉండిపోయిన ఆమె.. ఒక్కసారిగా పూలన్ దేవిలాగా మారిపోయింది. తన హస్తవాసిని ప్రయోగించింది.
వాచ్ షో రూమ్ లో సేల్స్ మెన్ ను మాటల్లో పెట్టింది. రెండు ఖరీదైన గడియారాలను సర్దేసింది. కానీ తాను చేస్తున్న బాగోతాన్ని మూడో కన్ను చూస్తుందని గ్రహించలేకపోయింది. ఇంకేముంది అమ్మగారి వ్యవహారం సీసీ కెమెరాలలో రికార్డు అయింది.. షాప్ నిర్వాహకులు అన్ని చూసుకున్న తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలు ఉన్న విజువల్స్ చూశారు. ఆమెను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. ప్రేమికుడికి గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఒక రేంజ్ లో ఉండాలి. ఇవన్నీ జరగాలంటే చేతిలో డబ్బు ఉండాలి. డబ్బు లేకుండా గిఫ్ట్ దొంగతనం చేస్తే.. దొంగ అవుతుంది గాని.. ప్రేమికురాలు ఎలా అవుతుంది.. పాపం ఈ చిన్న లాజిక్ మిస్ అయింది. అందుకే జైలు పాలైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. అప్పుడప్పుడు దొంగ కూడా అవుతుంది.
ఆమె వాచ్ షో రూమ్ లో దొంగతనం చేసింది కాబట్టి సరిపోయింది. అదే బంగారం షాప్ అయి వుంటే.. కిలోల కొద్ది బంగారాన్ని సర్దేసేదేమో. అప్పుడు ఏకంగా జాతీయ మీడియాలోనే పతాక శీర్షిక స్థాయిలో వార్తల్లోకి ఎక్కేది. అప్పుడు ఆమెకు విపరీతమైన ప్రచారం లభించేది. అన్నట్టు నేటి కాలంలో ఎవరికైనా నెగిటివ్ పబ్లిసిటీ వస్తేనే కదా సెలబ్రిటీ అయ్యేది. అలా వచ్చిన వాళ్లే కదా బిగ్ బాస్ లాంటి షోలకు వెళ్తున్నది.. ఈమెకు కూడా మీడియా అదే విధమైన ప్రచారం కల్పించి.. సెలబ్రిటీని చేస్తే బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేదేమో..
