Kukatpally Sahasra Case: హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో ఇటీవల 10 సంవత్సరాల బాలిక హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినప్పటికీ ఈ కేసులో ఏమాత్రం పురోగతి లభించలేదు. ఎన్ని వేల సీసీ కెమెరాలను జల్లెడ పట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఓ ఐటీ ఉద్యోగి ఇచ్చిన సమాచారం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఆ తర్వాత పోలీసులు రకరకాలుగా దర్యాప్తు చేసి.. సహస్రను హత్య చేసింది పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అని గుర్తించారు. అంతేకాదు అతడి ఇంట్లో రక్తపు మరకలు ఉన్న దుస్తులు.. పదునైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: కూకట్ పల్లి బాలిక హత్య కేసు.. వీడు మామూలోడు కాదు.. పోలీసులకే దిమ్మతిరిగిపోయింది
సహస్ర హత్య కేసులో సంచలన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.. ఇటీవల సహస్ర పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ బాలుడు కూడా హాజరయ్యాడు. సహస్రకు కేక్ కూడా తినిపించాడు. పుట్టినరోజు వేడుకలకు హాజరైనప్పుడే సహస్ర ఇంట్లో డబ్బుకు సంబంధించిన చర్చ జరిగింది. సహస్ర తల్లిదండ్రులు బీరువాలో డబ్బులు పెడుతున్న దృశ్యాన్ని ఆ బాలుడు చూశాడు. అప్పటినుంచి ఆ ఇంటి మీద రెక్కీ నిర్వహించాడు. సహస్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి పదునైన కత్తితో ఆమెను పొడిచాడు. ముందుగా కత్తితో గొంతును కోశాడు. ఆ తర్వాత అనేకమార్లు ఆమె శరీరం పై పోట్లు పొడిచాడు. ఇంట్లో ఉన్న నగదు 80,000 తీసుకెళ్లాడు. దొంగిలించిన నగదుతో క్రికెట్ బ్యాట్ కొనుగోలు చేయాలని ఆ బాలుడు భావించినట్టు తెలుస్తోంది. దానికంటే ముందు అతడు తన నోట్స్ లో నేరం ఎలా చేయాలి.. ఎలా వ్యవహరించాలి.. డబ్బును ఎలా దొంగతనం చేయాలి.. అనే ప్రశ్నలు వేసుకుంటూ.. తనను తాను ఎలా కాపాడుకోవాలో అందులో రాసుకున్నాడు. పోలీసులు ఆ బాలుడి ఇంట్లో తనిఖీలు చేయగా ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.
టీవీలలో, ఓటీటీలలో నేర కథలతో రూపొందే వెబ్ సిరీస్, సినిమాలు చూసి ఆ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తోంది.. వాస్తవానికి ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు చుట్టుపక్కల వారిని అనుమానించారు. అందులో ఈ బాలుడి కుటుంబం కూడా ఉంది. అప్పట్లో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా చుట్టుపక్కల వారు వారిని ప్రతిఘటించారు. అంతేకాదు సహస్రను అంతం చేసింది ఆమె తండ్రి అని వ్యాఖ్యానించారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో సహస్ర తండ్రి నేరం చేశాడని వార్తలను ప్రసారం చేశాయి. అయితే చివరికి సహస్ర విషయంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు చదివే పాఠశాలకు పోలీసులు వెళ్లి విచారిస్తున్నప్పుడు అతడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఒకానొక దశలో పోలీసులు అతడు నేరం చేయలేదని భావించారు. ఎందుకైనా మంచిదని ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేయగానే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.