https://oktelugu.com/

Khammam : ములుగు నుంచి మెడిసిన్ చేయడానికి ఖమ్మం వచ్చాడు.. ప్రొఫెసరేమో గుండు కొట్టించాడు.. దాని వెనుక ఏం జరిగిందంటే..

అతడు నూనూగు మీసాల వయసున్న కుర్రాడు. చిన్నప్పటినుంచి డాక్టర్ అని అనిపించుకోవడం అతనికి కోరిక. అందులో భాగంగానే కష్టపడి చదివాడు. నీట్ లో మెరుగైన ర్యాంకు సాధించాడు. ఏకంగా మెడిసిన్ సీట్ కొట్టేశాడు. గవర్నమెంట్ కాలేజీలో ప్రవేశం పొందాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 17, 2024 10:12 pm
Follow us on

Khammam : అతనికి వచ్చిన ర్యాంకుకు ఖమ్మం మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించింది. దీంతో అతడు తల్లిదండ్రులు అతడిని ఖమ్మంలో చేర్పించారు. క్లాసులు కూడా మొదలయ్యాయి. ఇటీవల వైట్ కోట్ సెర్మని కూడా పూర్తయింది. ఆ పిల్లాడు కూడా శ్రద్ధగా చదువుతున్నాడు. అయితే మొదటి నుంచి అతనికి విభిన్నమైన హెయిర్ స్టైల్స్ చేసుకోవడం అలవాటు. ఇందులో భాగంగా అతడు ఈ నెల 12న చైనీస్ నమూనాలో హెయిర్ కటింగ్ చేయించుకొని వచ్చాడు. అది చూసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు బాగోలేదని అన్నారు. దీంతో అతడు మళ్ళీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకొని వచ్చాడు. ఆ విద్యార్థి తిరిగి హాస్టల్ కి వచ్చేసరికి.. యాంటి ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు..” నువ్వెందుకు అలాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నావ్. ఇది మెడికల్ కాలేజీ అనుకున్నావా.. లేక ఫ్యాషన్ షో సెంటర్ అనుకున్నావా.. ఇలాంటి వేషాలు ఇక్కడ వేస్తే కుదరదు అంటూ” ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆ విద్యార్థిని బయటికి తీసుకెళ్లాడు. దగ్గర్లో ఉన్న సెలూన్ షాపులో గుండు గీయించాడు. దీంతో ఆ విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు

గుండుగీయించడంతో ఆ విద్యార్థి మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే ప్రిన్సిపాల్ కు ఆ ప్రొఫెసర్ పై కంప్లైంట్ ఇచ్చాడు. విద్యార్థి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ప్రిన్సిపల్ రాజేశ్వరరావు ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 13న ఆయనను విధుల నుంచి తప్పించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అంతేకాదు విద్యార్థులు ఆ ప్రొఫెసర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రిన్సిపాల్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. ఈ ఘటన వెనుక ఏం జరిగింది? ఆ ప్రొఫెసర్ అలా ఎందుకు చేశారు? విద్యార్థిపై వ్యక్తిగత ద్వేషం ఏదైనా ఉందా? కోణాలలో విచారణ కొనసాగించడానికి నలుగురు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేశారు. వారు ఇచ్చిన నివేదికను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు పంపిస్తామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

నల్లగొండ వైద్య కళాశాలలోనూ..

ఖమ్మం జిల్లాలో అలా జరిగితే.. నల్లగొండ జిల్లాలోని ర్యాగింగ్ భూతం కురులు విప్పింది. కేరళ రాష్ట్రానికి చెందిన జూనియర్ విద్యార్థులకు సరిగ్గా 15 రోజుల క్రితం సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దీంతో ఆ బాధిత విద్యార్థులు ఈనెల 12న ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు..” మాతో దారుణంగా మాట్లాడుతున్నారు. చెప్పినట్టు చేయమని వేదిస్తున్నారు. వ్యక్తిగత విషయాలు అడుగుతున్నారు. గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. వస్త్ర శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చెప్పడానికి వీలు కానీ భాషలో తిడుతున్నారని” ఆ విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ జూనియర్ డాక్టర్, ముగ్గురు వైద్య విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించింది.. పీకలదాకా మద్యం తాగిన అనంతరం..ఆ మత్తులో వారు ఇలా చేశారని పేర్కొంటూ ఆ నివేదికను జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు పంపించింది. ఫలితంగా 2020 బ్యాచ్ కు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులను ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు. 2023 బ్యాచ్ కు చెందిన మరో విద్యార్థికి ఒక నెలపాటు, జూనియర్ డాక్టర్ పై మూడు నెలల పాటు సస్పెన్షన్ వేటు విధించారు.