https://oktelugu.com/

Hyderabad : ఛీ ఛీ మీరు మనుషులేనా.. చిన్నపిల్లలని చూడకుండా.. అలాంటి ఐస్ క్రీం లు విక్రయిస్తారా.. హైదరాబాదులో దారుణం

విస్కీ ఐస్ క్రీమ్ తయారీకి సంబంధించిన వార్తలు మీడియాలో చూసిన తర్వాత నెటిజెన్లు మండిపడుతున్నారు.." ఛీ ఛీ మీరు మనుషులేనా.. చిన్నపిల్లలను చూడకుండా అలాంటి ఐస్ క్రీమ్ లు తయారు చేసి విక్రయిస్తారా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 6, 2024 10:38 pm
Whiskey Ice Creams

Whiskey Ice Creams

Follow us on

Whiskey Ice Creams : ఐస్ క్రీమ్.. ఈ పేరు చెప్తే చాలు చాలామంది నోట్లో లాలాజలం నయాగరా జలపాతం లాగా ఊరుతుంది. కాలం ఎలాంటిదైనా వెంటనే తినాలనిపిస్తుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఐస్ క్రీం ను ఇష్టపడుతుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐస్ క్రీమ్ లో రకరకాల ఫ్లేవర్లు సందడి చేస్తున్నాయి. అయితే ఈ ఐస్ క్రీం మాటున హైదరాబాద్ నగరంలో పెద్ద దందా నడుస్తోంది. ఇది అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోటళ్లు, బేకరీలు, ఇతర ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు పెరిగాయి. పేరుపొందిన హోటల్స్ నుంచి సామాన్య బేకరీల వరకు వేటిని కూడా అధికారులు వదిలిపెట్టడం లేదు. దీంతో ఆహార వ్యాపారం పేరుతో హోటళ్లు చేస్తున్న దండ బయటపడుతోంది. అయితే హైదరాబాదు నగరంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఐస్ క్రీం మాటున చేస్తున్న దారుణం ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఐస్ క్రీమ్ పార్లర్ పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేయగా సరికొత్త విషయాలు వెలుగు చూశాయి. హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో.. ఏకంగా విస్కీ కలిపిన ఐస్క్రీం విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకొని ఈ విస్కీ ఐస్ క్రీమ్ లు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో తేలింది. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో దాదాపు 60ml విస్కీ కలుపుతున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ లో సుమారు 11.5 కిలోల ఐస్ క్రీమ్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే విస్కీ ఐస్క్రీమ్ పేరుతో ఈ కేఫ్ నిర్వాహకులు భారీగా ప్రచారం చేసి మరీ విక్రయాలు జరపడం విశేషం.

ఇలా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న కేఫ్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. నగరంలో ఉన్న పార్లర్లు, అందులో జరుపుతున్న విక్రయాలను ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, కేఫ్ నిర్వాహకులు చిన్నపిల్లలే లక్ష్యంగా విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది.. అయితే ఈ విస్కీతో తయారుచేసిన ఐస్ క్రీమ్ తినడం వల్ల చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. నాడి, మెదడు, రక్త ప్రసరణకు సంబంధించిన అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. విస్కీతో పాటు ప్రమాదకర వస్తువులను కూడా ఈ ఐస్ క్రీమ్ తయారీలో వినియోగిస్తారని.. అవి ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. సాధ్యమైనంత వరకు ఇలాంటి ఐస్ క్రీమ్ లను చిన్నారులకు తినిపించకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇలా ప్రమాదకరమైన పదార్థాలతో తయారుచేసిన ఐస్ క్రీమ్ తింటే రకరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్ నగరంలో మరిన్ని పార్లర్ల పై దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే శోభన్, దయాకర్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. విస్కీ ఐస్ క్రీమ్ తయారీకి సంబంధించిన వార్తలు మీడియాలో చూసిన తర్వాత నెటిజెన్లు మండిపడుతున్నారు..” ఛీ ఛీ మీరు మనుషులేనా.. చిన్నపిల్లలను చూడకుండా అలాంటి ఐస్ క్రీమ్ లు తయారు చేసి విక్రయిస్తారా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.