Guntur Crime: ఇది మామూలు ఘోరం కాదు. మామూలు దుర్మార్గం కాదు. మాటలకందని విషాదం. ఊహకందని దారుణం.. రాయడానికి వీలు లేని పైశాచికం.. అసలు అలా ఎలా చేసింది.. అంతటి దుర్మార్గానికి ఎలా పాల్పడింది.. కట్టుకున్న వాడిని అలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది.. ఇప్పుడు ఈ ప్రశ్నలే సామాన్యుల నుంచి మొదలు పెడితే పోలీసుల వరకు వినిపిస్తున్నాయి.
ఆమె పేరు లక్ష్మీ మాధురి.. 2007లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన లోకం శివ నాగరాజును పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు మగ పిల్లల సంతానం. శివ నాగరాజు ఉల్లిపాయల వ్యాపారిగా పనిచేసేవాడు. లక్ష్మీ మాధురి విజయవాడలో ఓ సినిమా హాల్లో టికెట్ కౌంటర్ లో పనిచేసేది. అక్కడ పనిచేస్తుండగానే గోపి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గోపి సత్తెనపల్లి ప్రాంతానికి చెందినవాడు. తన భర్త చేసే వ్యాపారం లక్ష్మీ మాదిరికి నామోషీగా అనిపించింది. దీనికి తోడు గోపి తో సాగుతున్న బంధం ఆమెకు గొప్పగా అనిపించింది. గోపి హైదరాబాద్ నగరంలో కారు ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో భర్తను గోపి దగ్గరికి పంపించింది. ఆ తర్వాత కొంతకాలం అనంతరం నాగరాజు హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అప్పటినుంచి మాధురి, నాగరాజు మధ్య విభేదాలు మొదలయ్యాయి.
నాగరాజు ఇంటి వద్ద ఉండి వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో.. గోపితో సరసా నికి వీలు పడేది కాదు. ఎలాగైనా సరే అతడిని తొలగించుకోవాలని భావించింది. ఈనెల 18న రాత్రి ఆమె బిరియానీ వండింది. అందులో ఏకంగా 20 నిద్రమాత్రలను కలిపి పొడిగా మార్చి కలిపింది. బిర్యాని తిన్న అనంతరం నాగరాజు నిద్రపోయాడు. రాత్రి గోపి వచ్చాడు. నాగరాజు చాతి భాగంపై గోపి కూర్చున్నాడు. మాధురి ముక్కు మీద దిండు పెట్టి.. ఊపిరి ఆడకుండా చేసి చంపింది. నాగరాజు చనిపోయిన తర్వాత గోపి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి మొత్తం మాధురి ఆ వీడియోలు చూస్తూ ఉండిపోయింది. ఈలోగా తెల్లవారుతుండగా ఆకస్మాత్తుగా మాధురికి ఒక ఉపాయం తట్టింది. ఇరుగుపొరుగు వారిని ఇంటికి పిలిచింది. గుండె నొప్పితో తన భర్త చనిపోయాడని మహానటి లెవెల్ లో నటించింది.
లక్ష్మీ మాధురి గురించి తెలిసిన చుట్టుపక్కల వారు ఆమెను అనుమానించారు. నాగరాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా అతని స్నేహితులు వచ్చారు. నాగరాజు చెవి నుంచి రక్తం కారడాన్ని చూశారు. చెవి ప్రాంతంలో కూడా పెద్ద గాయం ఉండడాన్ని గమనించారు. ఆ తర్వాత నాగరాజు తండ్రికి ఈ విషయాన్ని చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎస్సై కేసు నమోదు చేసి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు. పోస్టుమార్టం లో నాగరాజు చాతి భాగంలో ఎముకలు విరిగినట్టు తేలింది. దీంతో పోలీసులు మాధురిని విచారించారు. దీంతో ఆమె జరిగిన ఘోరాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది.