https://oktelugu.com/

Honor killing : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుంటే నేరమా.. ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే?

నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తమ కుమార్తె వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందని మనస్థాపానికి గురయ్యారు. కుమార్తెను దారుణంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. దీంతో ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 21, 2024 / 04:24 PM IST

    Honor killing

    Follow us on

    Honor killing : కులం అనే రుగ్మత సమాజంలో చిచ్చు రేపుతోంది. కడుపులో పుట్టిన వారిని చిదిమేస్తోంది. వేరే కులం వారిని ప్రేమించారని.. వేరే మొత్తం వారిని పెళ్లి చేసుకున్నారని.. పరువు హత్యలు చోటు చేసుకోవడం సర్వ సాధారణంగా మారింది. తాజాగా నెల్లూరు జిల్లాలో పరువు హత్య వెలుగు చూసింది.కూతురు ప్రేమ వివాహం చేసుకున్న కోపంతో తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారు. ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి 100కు కాల్ చేయడంతో మిస్టరీ వీడింది. అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మారింది. కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    * కుమార్తె పై దాడి
    పల్లిపాలెం కు చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తెకు వివాహం జరిగింది. రెండో కుమార్తె శ్రావణి కి సైతం ఆరేళ్ల కిందట పెళ్లి చేశారు. కానీ భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. వీరు గ్రామంలోనే కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ ఆములూరుకు చెందిన రబ్బాని భాషాతో శ్రావణి కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 20 రోజుల కిందట కసుమూరు దర్గాలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే మతాంతర వివాహం చేసుకున్న కుమార్తె పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా ఇంటికి వెళ్లి కుమార్తె పై దాడి చేశారు. బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు.

    * అపరిచిత వ్యక్తి సమాచారంతో
    అయితే ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి 100కు కాల్ చేశాడు. వెంకట రమణయ్య ఇంటి ప్రాంగణంలో ఓ మహిళ మృతదేహాన్ని పూడ్చి పెట్టారని సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను సైతం ప్రశ్నించారు. అనుమానంతో శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో వారు అసలు విషయాన్ని ఒప్పుకున్నారు.

    * దారుణంగా కొట్టి చంపారు
    శ్రావణిని ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగింది. దీనిని తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా.. ఇంటి ప్రాంగణంలో గుంత తీసి పాతిపెట్టారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అడ్డంగా బుక్కయ్యారు.