Hyderabad : ఒకప్పుడు చోరీ అంటే భయపడేవారు. కానీ ఇప్పుడు చోరీ చేయడం ఈజీగా మారింది. కనిపించే దొంగల నుంచి కన పడని దొంగల వరకు చాలా మంది ఇతరుల సొమ్ము దోచుకుంటున్నారు. దీంతో దొంగలు ఎవరో చెప్పడం కూడా కష్టంగా మారింది. ఇక కొందరు పనివాళ్ల రూపొంలో ఇళ్లలోకి వెళ్లి.. నమ్మకంగా ఉండి.. అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి రూ.20 లక్షలను తాను పనిచేసే కంపెనీ నుంచి చోరీ చేశాడు. వాటిని ఎత్తుకెళ్లి.. ఓ పేడకుప్పలో దాచాడు. చివరకు వాటిని పోలీసులు గుర్తించారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో..
హైదరాబాద్‌లోని ఓ ఆగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా కంపెనీ లాకర్ నుంచి రూ.20 లక్షలు తీసుకుని పారిపోయాడు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గోపాల్ కోసం గాలింపు చేపట్టారు. గోపాల్‌ది ఒడిశా రాష్ట్రం కావడంతో వారి సహకారం తీసుకున్నారు. హైదరాబాద్, ఒడిశా పోలీసులు జరిపిన దాడిలో బాలాసోర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆవు పేడలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
అత్తమామ ఇంటి వద్ద..
గోపాల్ బెహరా ఎత్తుకెళ్లిన సొమ్మును అత్తమామల ఇంటి వద్ద పేడ కుప్పలో దాచాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కమర్డన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తమామల ఇంటిపై దాడి చేశారు.. సోదాలు చేసి నగదు పట్టుకున్నారు. రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ మాత్రం ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు.
బావ ద్వారా అత్తమామ గ్రామానికి..
గోపాల్ బెహరా లాకర్ నుంచి చోరీ చేసిన సొమ్మును తన బావ రవీంద్ర బెహెరా ద్వారా గ్రామానికి పంపించాడు. అయితే పోలీసులు గోపాల్‌తో సన్నిహితంగా ఉండేవారిని విచారణ చేయగా రవీంద్ర బహెరా అసలు విషయం చెప్పాడు. దీంతో ఆ గ్రామానికి వెళ్లి నగదు పట్టుకున్నారు. ప్రస్తుతం రవీంద్ర కూడా పరారీలోనే ఉన్నాడు.