Edupayala Temple: మనుషుల్లో రోజురోజుకూ పాప భీతి అనేది నశించిపోతోంది. మోసం, దగా, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం అనేది పెచ్చరిళ్లిపోతున్నాయి. దీంతో సాటి మనుషులపై ప్రేమ, కరుణ, ఆప్యాయత అనేవి మాయమైపోతున్నాయి. ఎంతసేపటికి ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. వారి వారి సొంత ప్రయోజనాల కోసం దేనికైనా తెగిస్తున్నారు. ఎంతకైనా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మనుషులను కూడా దాటేసి దేవుళ్ళ మీద పడుతున్నారు. సాధారణంగా దేవుడు అనే పదం వినిపిస్తే మనలో ఎవరికైనా భక్తి కలుగుతుంది. ఆ తర్వాత తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం ఆవరిస్తుంది. కానీ కాల మహిమో, మనుషుల్లో పెరిగిపోయిన స్వార్ధమో తెలియదు గాని దేవుళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. గుడులలో ఆకృత్యాలు చేయకుండా ఆపడం లేదు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుపాయల క్షేత్రం చాలా విశిష్టమైనది. ఈ ప్రాంతంలో వన దుర్గాదేవి కొలువై ఉంది. ఆకాశాన్ని తాకే కొండలు, దట్టమైన వృక్షాలు, ఆహ్లాదాన్ని కలిగించే ఏడుపాయలు.. భక్తులకు నయన మనోహరంగా కనిపిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రతిఏటా వన దుర్గ దేవికి జరిగే ఉత్సవాలకు లక్షలాదిగా హాజరవుతుంటారు.. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఇంతటి మహత్యం కలిగిన ఈ క్షేత్రంలో దొంగలు పడ్డారు. అది కూడా ఎటువంటి భయం లేకుండా, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పటికీ హుండీలను దొంగిలించారు. దొంగిలించిన ఆ హుండీలలో నగదు మొత్తం తీసుకొని.. ఆ పరిసర ప్రాంతాల్లో పడేశారు..
మరుసటి రోజు ఉదయం ఆలయ పూజారి అమ్మవారి కోవెల తలుపులు తెరిచేందుకు ఉదయాన్నే వెళ్లగా.. ఆ ప్రాంతం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. హుండీలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఆ ప్రాంతంలో పరిశీలించారు. అయితే ఆలయానికి కొంత దూరంలో హుండీలు కనిపించాయి. వాటిని పరిశీలించగా అందులో నగదు రూపాయి కూడా లేదు. ఆ పరిసర ప్రాంతాల్లో సిసి ఫుటేజ్ పరిశీలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. “శనివారం ఉదయం ఆలయ పూజారి ఫిర్యాదు చేశారు. సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాం. ప్రస్తుతం ఆధారాలు సేకరిస్తున్నాం. సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నాం. త్వరలో నిందితులను పట్టుకుంటామని” పోలీసులు పేర్కొంటున్నారు.
వనదుర్గ ఆలయంలో గతంలో ఎన్నడూ చోరీలు జరగలేదు. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో.. ఆలయంలో హుండీల పరిరక్షణ కోసం గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో ఇక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. మామూలు సమయాల్లో ఒకరు లేదా ఇద్దరు సెక్యూరిటీ విధులు నిర్వహిస్తుంటారు. అయితే పగలు దొంగతనం చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. దొంగలు రాత్రిపూట ఆలయంలో ప్రవేశించారు. ఆలయ హుండీలలో డబ్బు ఉంటుందని భావించి వాటిని ఎత్తుకెళ్లారు.
ఏడుపాయల వన దుర్గ ఆలయంలో హుండీలను చోరీ చేసిన దొంగలు
మెదక్ – ఏడుపాయల వన దుర్గ ఆలయం పాత కల్యాణ కట్ట గర్భగుడి వద్ద ఉన్న రెండు హుండీలను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు pic.twitter.com/2C3QJLKndF
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2024