Delhi: వరద నీరు ఎలా పోటెత్తింది? ముగ్గురు విద్యార్థులు ఎలా మరణించారు? ఢిల్లీ రాజేంద్రనగర్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ప్రమాదంలో షాకింగ్ నిజాలు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లో కి వరద నీరు పోటెత్తడంతో తాన్యా సోని, నవీన్ డాలి, శ్రేయ యాదవ్ అనే ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 29, 2024 9:41 am

Delhi

Follow us on

Delhi: వారు ఉన్నత చదువులు చదివారు. సివిల్స్ సాధించాలనే పట్టుదలతో ఢిల్లీ వచ్చారు. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అక్షరాలతో యజ్ఞం చేస్తున్నారు. వచ్చే పరీక్షల్లో ఎలాగైనా సత్తా చాటి.. సివిల్స్ అధికారులుగా ఎంపిక కావాలని కలలు కంటున్నారు. అయితే వారి కలలను నిర్లక్ష్యం చిదిమేసింది. వరద నీరు పోటెత్తడంతో వారి ఊపిరి ఆగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లో కి వరద నీరు పోటెత్తడంతో తాన్యా సోని, నవీన్ డాలి, శ్రేయ యాదవ్ అనే ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు.. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంధాలయంలోకి పోటెత్తింది. అయితే ఇండియా రేపు చేపట్టిన సహాయక చర్యలతో ఆ విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో తానియా సోని అనే విద్యార్థిని కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో నివసిస్తోంది. శ్రేయ ఉత్తర ప్రదేశ్, నవీన్ కేరళ నుంచి వచ్చి ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నారు.. అయితే తాన్యా స్వస్థలం బీహార్ లోని ఔరంగాబాద్. ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలోని సింగరేణి సంస్థలు డీజీఎం గా పనిచేస్తున్నారు. “ఢిల్లీలో పొలిటికల్ సైన్స్ లో నా కూతురు బిఏ పట్టా పొందింది. నెల రోజుల క్రితమే సివిల్స్ కోచింగ్ లో చేరింది. మేము లక్నో వెళ్తుండగా ఈ విషయం తెలిసింది. నాగ్ పూర్ లో రైలు దిగి.. విమానంలో ఢిల్లీ వెళ్లాం. ఆమె మృతదేహంతో బీహార్ బయలుదేరి వెళ్లాం. నా కూతురు సివిల్స్ కల చెదిరిపోయింది. ఇక ఆమె సివిల్ సర్వెంట్ గా దేశానికి సేవలు అందించలేదని” తాన్యా సోనీ తండ్రి విజయకుమార్ కన్నీటి పర్యంతమవుతూ పేర్కొన్నారు.

ఈ ప్రమాదం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని వారి స్నేహితులు వాపోతున్నారు. “ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేదు. అందులో పూడిక పేరుకుపోయింది. వారిని తీయాలంటూ స్థానిక కౌన్సిలర్ కు మేము గతంలోనే చెప్పాం. అయితే అతను వినిపించుకోలేదు.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా పట్టించుకోలేదు. అందువల్లే వరద నీరు పోటెత్తింది. దీంతో వారు కన్నుమూశారని” తోటి విద్యార్థులు వాపోతున్నారు.. ప్రమాదం జరిగిన అనంతరం స్టడీ సర్కిల్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ కు వెళ్లే దారిని పూర్తిగా దిగ్బంధించారు. సంఘటనా స్థలాన్ని ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ సందర్శించారు. పలువురు విద్యార్థులను పరామర్శించారు. అయితే మురుగునీరు ఒకసారిగా పైకి రావడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. పైగా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ ప్రాంతాలలో కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. పైగా ఆ ప్రాంతంలో మురుగునీరు ప్రవహించే కాల్వలో ఆక్రమణకు గురై, పూడుకుపోయాయి. అందువల్లే నీరు వెళ్లే మార్గం లేక ఒక్కసారిగా పైకి వచ్చింది. అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ రెవెన్యూ శాఖ మంత్రి అతీశీ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు. అయితే విద్యార్థుల మృతదేహాలను చూసేందుకు స్నేహితులకు, బాధిత కుటుంబాల వారికి ఢిల్లీ పోలీసులు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రి మార్చురీ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే ఈ ఘటన పట్ల తీవ్రంగా స్పందించారు.. ప్రభుత్వం, అధికార యంత్రంగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గతవారం పటేల్ నగర్ లో వాన నీటి కారణంగా ఓ సివిల్స్ విద్యార్థి కరెంట్ షాక్ కు గురై చనిపోయాడని ఆయన గుర్తు చేశారు.

ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరిగే సమయంలో కోచింగ్ సెంటర్ భవనం ఎదుట వరద నీరు భారీగా చేరింది. ఆ క్రమంలో ఓ ఫోర్ వీలర్ వాహనం వేగంగా దూసుకుపోయింది. ఆ వేగానికి నీటి అలలు గేటును తాకడంతో అది విరిగిపోయింది. ఫలితంగా వరద నీరు సెల్లార్ లోకి ప్రవహించింది. అందువల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరోవైపు స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్త, కోఆర్డినేటర్ దేశ్ పాల్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేశారు. ప్రమాదం చోటు చేసుకున్న మూడు అంతస్తుల భవనం సెల్లార్ ను స్టోర్ రూమ్, పార్కింగ్ కు కేటాయిస్తామని చెప్పి.. లైబ్రరీగా ఉపయోగిస్తున్నట్టు పోలీసులకు విచారణలో తేలింది. ఆ ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులోనే ఉన్నారు. భారీగా వర్షం నీరు రావడంతో సెల్లార్ నుంచి రాకపోకలకు వీలు కాలేదు. ఈ ప్రాంతంలో సింగిల్ బయోమెట్రిక్ ద్వారం ఉంది. వర్షపు నీరు పోటెత్తడంతో అది పనిచేయలేదు.