Delhi Crime News: నేటి సాంకేతిక కాలంలో తప్పు చేసినవారు ఎప్పటికీ తప్పించుకోలేరు.. సీసీ కెమెరాలలో ముఖం కనిపించకుండా.. ఎటువంటి ఆధారాలను వదిలిపెట్టకుండా.. దర్జాగా నేరం చేశామని నేరగాళ్లు అనుకోవచ్చు.. కానీ ఏదో ఒక ఆధారం వాళ్ళను పట్టిస్తుంది.. జైలు ఊచలు లెక్కపెట్టే విధంగా చేస్తుంది. అటువంటి సంఘటనే ఇది.. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ సంఘటన క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించి ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక హత్యాయత్నం చోటుచేసుకుంది. డిసెంబర్ 15న కరోల్ బాగ్ ప్రాంతంలో అజ్మల్ ఖాన్ పార్క్ ఆవరణలో ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సరదాగా ఇన్ స్టా లో రీల్స్ చిత్రీకరిస్తున్నాడు. వారి పక్కనే ముగ్గురు వ్యక్తులు మద్యం తాగారు. మత్తులో ఆ ఇద్దరు వ్యక్తులపై ఆ ముగ్గురు దారుణంగా ప్రవర్తించారు.. అంతేకాదు సిగరెట్ కాల్చడానికి అడిగారు. దానికి ఆ ఇద్దరు వ్యక్తులు లేదని సమాధానం చెప్పారు. తాము అడిగితే అగ్గిపెట్టె లేదని చెప్పారనే అక్కసుతో ఆ ముగ్గురు వ్యక్తులు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిపై దారుణానికి పాల్పడ్డారు. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి ఆవేశం తట్టుకోలేక బీరు సీసాతో బాధితుడి తల మీద బలంగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. నెత్తుటి మడుగులో గిలగిలా కొట్టుకున్నారు.
ఈ కేసు ఢిల్లీ పోలీసులకు సవాల్ గా మారింది.. నిందితులను పట్టుకునే ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు. ఆధారాల కోసం పోలీసులు పరిశీలిస్తుండగా.. పగలగొట్టిన బీరు సీసా కనిపించింది. దాని మీద ఉన్న బార్కోడ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బార్కోడు మ్యాచ్ అయిన మద్యం దుకాణం వద్ద సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన స్కూటర్.. వారు వెళ్ళిన మార్గాలను సీసీటీవీ ద్వారా పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత ఆ ముగ్గురు చిరునామా కనిపెట్టారు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తుల పేర్లు అహ్మద్ అలియాస్ రిజ్వాన్, కమ్రాన్, ఫర్దాన్ అని గుర్తించారు. మహమ్మద్ అనే వ్యక్తిపై ఇప్పటివరకు 20 నేరాలు ఉన్నాయి. మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం దారుణానికి పాల్పడిన ఆ ముగ్గురు ఇప్పుడు జైల్లో ఉన్నారు.