Brij Bhushan Sharan Singh: అతడి పేరు బ్రిజ్ భూషణ్.. ఉత్తర్ ప్రదేశ్ లో అధికార బిజెపి ఎంపీ. గూగుల్ చేస్తే ఆయన గారి బాగోతాలు మామూలుగా లేవు. డేరా బాబాకు చట్టం అనుకుంటా. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆకృత్యాలు.. అవన్నీ వెలుగులోకి వచ్చినా అతడిని ఏమీ చేయలేకపోయాయి. గ్యాంగ్ స్టర్లు, అక్రమార్కులపై, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడిన వారిపై బుల్డోజర్ ప్రయోగించే యోగి.. ఇతడి పైకి ఎందుకు బుల్డోజర్ పంపించలేదనేది ఓ ప్రశ్న. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ఉందని చెబుతున్న యోగి.. ఇతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంటే సొంత పార్టీ వాడికి ఒక న్యాయం, బయటి వాళ్లకు ఒక న్యాయమా? ఆర్థిక శాఖను ఒక మహిళ చేతుల్లో పెట్టిన ప్రధాని.. మరి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్న ఎంపీని ఎందుకు ఏమీ చేయలేకపోయారు.. ఇలాంటి ఉదంతాలు పార్టీకి ఎలాంటి గౌరవాన్ని తీసుకొస్తాయో? ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాయో? నరేంద్ర మోడీకి తెలియదా? ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో కర్ణాటకలో జేడిఎస్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాలా…
ఏకంగా ఆరుగురు మహిళా రెజ్లర్లు కేసు దాఖలు చేస్తే.. ఇప్పటికి గానీ అతనిపై అభియోగాలు మోపే విషయంలో అడుగు ముందుకు పడలేదు. చివరికి కోర్టు జోక్యం చేసుకోవడంతో అతడు చేసిన ఆకృత్యాలు నమోదయ్యేందుకు అవకాశం కలిగింది. అయితే ఆరో రెజ్లర్ చేసిన ఆరోపణల నుంచి అతడు నిర్దోషి అని కోర్టు ప్రకటించడం ఇక్కడ విశేషం. కీలకమైన ఆధారాలు లభించిన తర్వాత.. ఆ మహిళ రెజ్లర్ల ఆవేదన నిజమే అని అర్థమైన తర్వాత .. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్ పుత్ ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం అతనిపై అభియోగాలు నమోదు చేస్తారట.. మహిళా రెజ్లర్లు ఆధారాలు సమర్పించిన తర్వాత.. అభియోగాలు నమోదు చేసేందుకు ఇంతకాలం ఎందుకు పట్టింది.. అతడిని ఎవరు రక్షించారు.. ఇలాంటి చర్యల వల్ల దేశం పరువు పోదా? ఇలాంటివారు భారతీయ జనతా పార్టీలో ఉంటే.. ఆ పార్టీకి మాయని మచ్చ కదా.. విశ్వగురు అని చెప్పుకుంటున్న సమయంలో.. ఇలాంటి కామపిశాచిని ఎంపీగా గౌరవించాలా? ఇలాంటి వ్యక్తి ఎంపీగా అవసరమా? పైగా అతని చరిత్ర మొత్తం తెలిసిన తర్వాత కూడా బిజెపి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందంటే ఏమనుకోవాలి?
చివరికి రెజ్లర్లు మడమ తిప్పని పోరాటం చేయడం ద్వారా బ్రిజ్ భూషణ్ పై 354, 354a సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసేందుకు కోర్టు ఒప్పుకుంది. డబ్ల్యూ ఎఫ్ ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పై కూడా అభియోగల నమోదుకు కోర్టు ఒప్పుకుంది.. ఇప్పుడు సాక్ష్యాధారాలు లభించాయని కోర్టు ప్రకటించింది. కానీ ఇదే సాక్ష్యాధారాలతో బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీ నడివీధిలో పోరాటం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వారికి వచ్చిన మెడల్స్ తిరిగి ఇస్తామని చెబితే అప్పుడు ఒప్పుకుంది.. అతనిపై అభియోగాలను నమోదు చేసేందుకు ఇంతకాలం పట్టింది. మరి ఇప్పటికైనా మన వ్యవస్థ అతడిని శిక్షిస్తుందా? బాధిత మహిళ రెజ్లర్లకు న్యాయం జరుగుతుందా? ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.