CyberCrime : సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని ఎంత సుఖవంతం చేసిందో.. అదే స్థాయిలో సమస్యలు తెచ్చిపెడుతోంది. పెరిగిన ఈ పరిజ్ఞానం ద్వారా సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడం మాటేమిటో గాని.. దీని ఆధారంగా అడ్డగోలుగా సంపాదిస్తూ.. జనాలను కేటుగాళ్లు నిండా ముంచుతున్నారు. ఇందుకోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పలు విధానాలలో మోసాలు చేస్తూ డబ్బులు లాగుతున్నారు.. “మత్తు పదార్థాలు అమ్మతో మీ అమ్మాయి దొరికిందని.. ఆమెపై కేసు లాంటివి నమోదు చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని.. మీ కూతుర్ని కిడ్నాప్ చేశామని.. వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనని” ఇలా రకరకాలుగా మాట్లాడుతూ.. జనాలను బురిడీ కొట్టిస్తున్నారు..
బైంసా మండలంలో..
నిర్మల్ జిల్లాలోని బైంసా మండలం ఇలెగం గ్రామానికి చెందిన కాంబ్లే వెంకటేష్ అనే వ్యక్తికి ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ సమయంలో అతడు ఫోన్ ఎత్తలేదు. ఎందుకైనా మంచిదనుకొని ట్రూ కాలర్లో చెక్ చేశాడు. అందులో పోలీస్ అధికారి పేరు డిస్ ప్లే అయింది. దానికి బ్లూ టిక్ కూడా ఉంది. ఎందుకైనా మంచి దాని కాల్ బ్యాక్ చేశాడు.. అతడు ఫోన్ చేయడమే ఆలస్యం.. ఎత్తిన వ్యక్తి..”మీ కూతురు పేరు శృతి.. మాదకద్రవ్యాలు అమ్ముతుంటే హైదరాబాదులో పట్టుకున్నాం. నిమిషాల్లోనే ఇక్కడికి రావాలి. ఆమెను ఈ కేసుల నుంచి బయట పడేయాలంటే నగదు ఫోన్ పే చేయాలని” సూచించాడు. ఆ కాల్ తో ఒకసారిగా వెంకటేష్ భయపడ్డాడు. ఆ తర్వాత కాస్త తెలివిగా ఆలోచించి.. తన కూతురు చదువుతున్న గురుకుల పాఠశాలకు ఫోన్ చేశాడు. ఆ పాప స్కూల్లో ఉందని ప్రిన్సిపాల్ తెలిపాడు. దీంతో వెంకటేష్ ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు చెప్పి..
హైదరాబాదులోని ఓ 80 సంవత్సరాల వృద్ధురాలికి ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ ఎత్తగానే.. అవతలి వ్యక్తులు బెదిరింపులు మొదలుపెట్టారు. “మాదకద్రవ్యాలు మీ ఫోన్ నెంబర్ ద్వారా పార్సిల్ అవుతున్నాయని మాకు సమాచారం అందింది. మావద్ద ఆధారాలు కూడా ఉన్నాయి.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయి. మీ మీద కేసు నమోదు చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మీ దగ్గర ఉన్న నగదు కూడా రీ వెరిఫికేషన్ కోసం మాకు పంపించాలి. ఈ ఫోన్ కాల్ మేము పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి చేస్తున్నామని” అవతలి వ్యక్తులు చెప్పారు. ఇది నిజమే అనుకొని భావించిన ఆ వృద్ధురాలు.. తన వద్ద ఉన్న నగదును ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు చెప్పిన నంబర్ కు పంపించింది. ఆ తర్వాత ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే వారు ఎత్తలేదు. దీంతో మోసపోయానని భావించి.. ఆ విషయాన్ని తన కుమారుడికి చెప్పింది. వెంటనే అతను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వచ్చిన ఈ ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. వచ్చిన ఫోన్ కాల్స్, ఖాతా నంబర్లు, లొకేషన్ ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. అయితే ఇతర ఫోన్ కాల్స్ ను ఎత్తొద్దని పోలీసులు చెబుతున్నారు.