https://oktelugu.com/

Cyber Crime : రా రా.. నీకు దమ్ముంటే అరెస్టు చేయ్.. ముందు ఈ ఫోన్ కట్ చేయ్..

చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులో అపరిమితమైన డాటా ఉంటుంది. సైబర్ అంశాలపై విపరీతమైన అవగాహన ఉంటుంది. ఆ తర్వాత అసలు ప్రణాళిక అమలవుతుంది. అమాయకులు దొరికితే  ఖాతాలో దండిగా డబ్బు పడుతుంది. లేకుంటే ఇదిగో ఇలానే ముఖం వాచిపోతుంది. 

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 10, 2024 / 01:10 PM IST

    Digital arrest

    Follow us on

    Cyber Crime :  సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అడ్డగోలుగా సంపాదించే అక్రమార్కులు కూడా పెరిగి పోయారు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ.. లేనిపోని భయాలను సృష్టిస్తూ.. ఆందోళనలు కలగజేస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నారు. దీనికి రకరకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు ఎన్ని రకాల మార్గాలను అనుసరిస్తున్నప్పటికీ.. దుర్మార్గులు అంతకుమించి అన్నట్టుగా మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఫలితంగా అమాయకులు మోసపోతున్నారు. గత కొంతకాలంగా సైబర్ మోసగాళ్లు “డిజిటల్ అరెస్ట్” అనే మయోపాయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ” మీరు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు.. మాదకద్రవ్యాలను తీసుకొస్తున్నారు. మీ ఆధార్ కార్డుతో బ్యాంకు ను మోసం చేశారు. మీ పేరుతో కొరియర్ వచ్చింది. అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయి” ఇలా రకరకాల పేర్లతో అమాయకులను సైబర్ మోసగాళ్లు భయపెడుతున్నారు. రకరకాల కేసులను తెరపైకి తీసుకొచ్చి డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరిస్తున్నారు.
    దమ్ముంటే ముందుకొచ్చి విచారించు 
    సైబర్ మోసగాళ్లు తీసుకొచ్చిన డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ ను ముంబై మహిళ ధైర్యంగా ఎండ కట్టింది. ఓ ఫ్రాడ్ తనకు ఫోన్ చేసి.. బెదిరించే ప్రయత్నం చేశాడు.. ఆమెకు ఏకంగా వీడియో కాల్ చేసి ” మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఐదుగురు వ్యక్తులు రెండు కోట్ల మోసానికి పాల్పడ్డారు. మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలి. లేకుంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తాం. మీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. ఆ తర్వాత మీరు అనేక రకాల కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కేసుల తీవ్రత అధికంగా ఉంటుంది. పైగా ఇవి ఆర్థిక మోసాలు కాబట్టి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కోర్టుల చుట్టూ మీరు తిరగలేరని” ఆ మోసగాడు బెదిరించాడు. అలా బెదిరించేసరికి ఆ అమ్మాయి కాళ్ళ బేరానికి వస్తుందని.. తను చెప్పినట్టుగా చేస్తుందని అతడు భావించాడు. కానీ అలా జరగలేదు. పైగా ఆమె ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టింది.” నీకు దమ్ముంటే.. నిజంగా నువ్వు పోలీసు వైతే వ్యక్తిగతంగా వచ్చి విచారించు. ఇలా వీడియో కాల్ లో పనికిమాలిన ప్రయత్నం చేయకు. రారా.. నీకు దమ్ముంటే అరెస్టు చేయ్.. ముందు ఈ ఫోన్ కట్ చేయ్” ఆంటూ ఆమె బదులు ఇవ్వడంతో ఆ ఫ్రాడ్ స్టర్ ముఖం వాచిపోయింది. దెబ్బకు ఫోన్ కట్ చేశాడు. తనకు జరిగిన ఈ అనుభవాన్ని ఆ మహిళ సైబర్ పోలీసుల దృష్టికి తీసుకురావడంతో.. వారు కేసు నమోదు చేశారు. ముంబై లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ మోసాలను ఎండ గడుతోంది.