Homeక్రైమ్‌Megha Company: ఐదు కోట్లు కొట్టేసిన పట్టించుకోని మేఘా కంపెనీ... చివరకు విషయం తెలిసి లబో...

Megha Company: ఐదు కోట్లు కొట్టేసిన పట్టించుకోని మేఘా కంపెనీ… చివరకు విషయం తెలిసి లబో దిబో

Megha Company: మేఘా(MEIL mega engineering infrastructure limited) కంపెనీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశం మొత్తం మీద ఈ కంపెనీ అనేక ప్రాజెక్టులను నిర్మించింది. నిర్మిస్తూనే ఉంది. ఈ కంపెనీ చేతిలో కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులున్నాయి.

ఈ కంపెనీ పనులు మాత్రమే కాదు.. రాజకీయ పార్టీలకు కూడా వందల కోట్లలో విరాళాలు ఇస్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నుంచి మొదలుపెడితే భారత రాష్ట్ర సమితి వరకు ప్రతి రాజకీయ పార్టీకి ఈ కంపెనీ విరాళం ఇస్తూనే ఉంటుంది. కీలక ప్రాజెక్టులు దక్కించుకోవడానికి తెరవెనక పనులు చాలా చేసిందని ఈ కంపెనీ మీద ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తున్న ఈ కంపెనీ.. వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చే ఈ కంపెనీ మోసపోయింది. అది కూడా ఫైబర్ నేరగాళ్ల చేతుల్లో.. ఈ విషయం జాతీయ మీడియాలో శనివారం ఉదయం నుంచి తెగ ప్రసారమవుతోంది.

యూరప్ కంపెనీ తో కలిసి పని..

ప్రస్తుతం మేఘా కంపెనీ యూరప్ లో ఓ కంపెనీ తో కలిసి పని చేస్తున్నది. ఆ కంపెనీకి చేసిన సేవలకు.. పంపించిన సామగ్రికి ఐదున్నర కోట్ల డబ్బులు చెల్లించాల్సిన అవసరం మేఘా కంపెనీకి ఏర్పడింది. దీంతో మేఘా కంపెనీ సదరు కంపెనీకి ఐదున్నర కోట్ల రూపాయలను పంపించింది. అయితే సరిగ్గా ఒక నెల తర్వాత ఆ కంపెనీ నుంచి డబ్బులు చెల్లించాలని మెసేజ్ వచ్చింది.. దీంతో మేఘా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు పరిశీలించే సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. లేదు లేదు మీకు డబ్బులు పంపించాం అంటూ వారికి రిప్లై ఇచ్చారు. లేదు మీ దగ్గర నుంచి మాకు ఎటువంటి డబ్బు రాలేదు.. కాకపోతే మా ఖాతాలు చూడండి అంటూ వారు తమ బ్యాంకు స్టేట్మెంట్ రికార్డులను పంపించారు. దీంతో మేఘా కంపెనీ సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది.

సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు

మేఘా కంపెనీ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అంతేకాదు మేఘా కంపెనీకి సైబర్ నేరగాళ్లు సదరు యూరప్ కంపెనీ తో ఒక బినామీ ఖాతా నెంబర్ పంపించారు. అది నిజమైన ఖాతా నెంబర్ అనుకొని భావించిన మేఘా కంపెనీ సిబ్బంది ఆ నెంబర్ కు నగదు బదిలీ చేశారు. నగదు బదిలీ చేసిన అనంతరం క్రాస్ చెక్ చేసుకోవడంలో మేఘా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు పరిశీలించే సిబ్బంది విఫలమయ్యారు. అయితే సదరు యూరప్ కంపెనీ తెలియజేయడంతో తాము మోసపోయామని మేఘా కంపెనీ బాధ్యులు లబో దిబో అంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకోవడానికి ఇలాంటి బినామీ నెంబర్లను సృష్టించి.. డబ్బులను తమ సొంత ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. బినామీ మెయిల్స్.. ఒక అక్షరం తేడాతో ఖాతా నంబర్లు సృష్టించి సైబర్ నేరగాళ్లు ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో అప్రమత్తంగా లేపోతే అసలుకే మోసం వస్తుంది. అందువల్లే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.. అయితే ఇది అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల పని కావడంతో పోలీసులు కూడా పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. అయితే ఈ ఘటన జరిగి కూడా 2 నెలలు అవుతున్నది. అందువల్లే పోలీసులు కూడా జరిగిన ఘటనపై ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మరోవైపు యూరప్ సంస్థ తమకు డబ్బులు చెల్లించాలని కోరుతున్నది. ఈ క్రమంలో మేము మోసపోయాం, డబ్బు చెల్లించలేమని మేఘా కంపెనీ చెబితే యూరప్ కంపెనీ ఊరుకోదు. పాపం దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మేఘా కంపెనీకి ఎంత కష్టం వచ్చింది..పాపం..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version