Chennur SBI: సాధారణంగా మన సినిమాలలోనే భారీ ఎత్తున దొంగతనం జరిగే సంఘటనలు చూస్తుంటాం. నిజ జీవితంలో అలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 కిలోలకు పైగా బంగారం చోరీకి గురైంది. అది కూడా మనదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్యాంకుగా పేరుపొందిన ఎస్ బీ ఐ లో. ఇంకేముంది ఖాతాదారులు లబోదిబో అన్నారు. బ్యాంకు అధికారులు స్పందించారు. మీ బంగారానికి మాది పూచి అన్నారు. దొంగతనానికి సంబంధించి పోలీసులకు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వారు రంగంలోకి దిగారు. ఇక అప్పటినుంచి అసలు కథ మొదలైంది.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ శాఖలో నగదు, బంగారు ఆభరణాల దొంగతనం జరిగింది. దాదాపు 12.60 కోట్ల విలువైన 20.487 కిలోల బంగారు ఆభరణాలు గత నెల 21 తేదీన దొంగతనం జరిగినట్టు గుర్తించారు. బ్యాంకు లో బంగారు ఆభరణాలు, నగదు నిల్వలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆడిట్ చేస్తున్న క్రమంలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ నితీష్ కుమార్ గుప్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో క్యాషియర్ పై బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. పైగా ఆడిట్ జరుగుతున్నప్పుడు క్యాషియర్ రవీందర్ అధికారులకు సహకరించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు అతని మీద అనుమానం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వారిదైన శైలిలో విచారించగా రవీందర్ బాగోతం బయటపడింది. రవీందర్ మాత్రమే కాకుండా ఇంకా 43 మంది ఈ చోరీలో పాలుపంచుకున్నారని తెలుస్తోంది. దొంగతనం చేసిన నగలను చుట్టుపక్కల ఉన్న మంచిర్యాల, చెన్నూరు పట్టణంలోని పలు ప్రైవేట్ సంస్థల్లో తాకట్టు పెట్టారు. ఆ సంస్థల నుంచి దాదాపు 15.237 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి పాల్పడిన రవీందర్, బీరేష్, రాజశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు…
చోరీ చేసిన బంగారాన్ని పలు ప్రైవేట్ సంస్థల్లో తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు నిందితులు.. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారాన్ని చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ శాఖ లోనే భద్రపరిచారు. అయితే ఈ నగదును నిందితులు ఏం చేశారు అనేది తెలియ రాలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే బ్యాంకులో చోరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టుకునేందుకు కొన్ని సంస్థల ప్రవేటు ఉద్యోగులు వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహారంపై న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.. రవీందర్ అత్యాశ వల్లే ఈ వ్యవహారం జరిగిందని పోలీసులు అంటున్నారు. ఖాతాదారులు నమ్మి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడితే ఇంతటి దారుణానికి పాల్పడ్డారని.. ఖాతాదారులలో నమ్మకాన్ని పెంపొందించడానికి తాము రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు.