Rajanna Sirisilla: తల్లిదండ్రులను ఈ సృష్టిలో వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపాలుగా పేర్కొంటారు . తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్ధకతను తండ్రి కలిగిస్తాడు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అనే నానుడులు పుట్టాయి. అయితే ఈ తల్లిదండ్రులు మాత్రం తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని పాశవికంగా హత్య చేశారు. అంతేకాదు 13 నెలల బాలుడికి అమ్మ ప్రేమను దూరం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఈ సంఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెపియాల నరసయ్య, ఎల్లవ్వ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె పేరు ప్రియాంక (25).. గత ఏడు సంవత్సరాలుగా ప్రియాంక మానసిక సమస్యతో బాధపడుతోంది. అయితే ఈమెను పలు ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి చేతబడి అనుమానంతో గుళ్లు, మసీదులు తిప్పారు. కొంతవరకు వ్యాధి న్యాయం కావడంతో 2020లో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లి చెందిన పృథ్వి అనే యువకుడితో వివాహం చేశారు. పృథ్వి, ప్రియాంక కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.. అయితే నెల నుంచి ప్రియాంక ఎప్పటిలాగే ప్రవర్తిస్తోంది. మానసిక వ్యాధితో బాధపడుతూ అందరిని దూషిస్తోంది. చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకుంటున్నది. ఆమె ప్రవర్తనతో విసిగి వేసారి పోయిన పృథ్వి అత్తామామలకు ఈ విషయాలు చెప్పాడు. దీంతో వారు కరీంనగర్ వచ్చి ఆమెను తమ వెంట తీసుకెళ్లారు. ముందుగా బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ మూడు రోజులపాటు ఉన్నారు. అయినప్పటికీ నయం కాలేదు. దీంతో స్వగ్రామం నేరేళ్లకు ఆమెను తీసుకొచ్చారు. ఈనెల 14వ తేదీ రాత్రి ప్రియాంక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. ఆమె గొంతుకు దారం బిగించి హత్య చేశారు. 15న ప్రియాంక మృతదేహాన్ని తన అత్తగారి స్వగ్రామమైన దర్గాపల్లికి తీసుకెళ్లారు. చేతబడి వల్ల ప్రియాంక మృతి చెందిందని అందర్నీ నమ్మించారు.. అంత్యక్రియలు జరిపించారు.
ప్రియాంక మృతి పట్ల నేరెళ్ల వాసులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా తల్లిదండ్రుల హత్య చేసినట్టు తేలింది. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి వివరాలు సేకరించి.. వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది. అటు సిద్దిపేట జిల్లాలోనూ కలకలం రేపింది. ఇటు తల్లి హత్యకు గురి కావడం, అటు అమ్మమ్మ తాతయ్యలు జైలుకు వెళ్లడంతో.. ఆ 13 నెలల బాలుడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.