Shakeel Son Rahil
Shakeel Son Rahil: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో ప్రజాభవన్ ఎదుట రోడ్డు ప్రమాదానికి కారణమై.. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రకరకాల అక్రమాలు చేసిన.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహిల్ ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. అతనితోపాటు ఆ కేసులో రాహిల్ ను రక్షించేందుకు ప్రయత్నించిన 15 మంది పోలీసులు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సంఘటన మర్చిపోకముందే రాహిల్ పై మరో కేసు నమోదయింది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడని అభియోగాలు మోపుతూ పోలీసులు అతనిపై మరో కేసు నమోదు చేశారు.
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో రెండు సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పట్లో ఈ కేసును బోధన్ ఎమ్మెల్యే షకీల్ తనకున్న రాజకీయ పలుకుబడితో వెలుగులోకి రాకుండా చేశాడనే ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల అంబేద్కర్ ప్రజా భవన్ డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో పోలీసులు రాహిల్ ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన రోడ్డు ప్రమాదానికి అతడే కారణమని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతడిని నిందితుడిగా చేర్చి, సెక్షన్లు మార్చి కేసు దర్యాప్తు మళ్ళీ ప్రారంభించారు.
మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, ఆమె బంధువులు సారిక చౌహాన్, సుష్మా చౌహన్.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఫుట్ పాత్ వద్ద బెలూన్లు, స్ట్రాబెరీలు అనుకుంటూ జీవించేవారు. కాజల్ కు రెండు నెలల బాబు రణవీర్ ఉన్నాడు. 2022 ఫిబ్రవరి 17 రాత్రి 8 గంటల సమయంలో కాజల్ కుటుంబ సభ్యులు డివైడర్ దాటుతుండగా ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారంతా గాయపడగా.. రెండు నెలల చిన్నారి రణవీర్ మృతి చెందాడు. ఆ కారులోని ముగ్గురు యువకులు పరారయ్యారు. అప్పట్లో ఆ వాహనంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ కనిపించింది. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రమాదంపై పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ కారు నడిపింది తానే అంటూ ఆఫ్రాన్ అనే యువకుడు పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు. ఆ కారులో అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్, స్నేహితుడు మహమ్మద్ మాజ్ ఉన్నట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కారు స్టీరింగ్ పై ఉన్న వేలిముద్రలు ఆఫ్రాన్ వేలిముద్రలతో సరిపోయాయని పోలీసులు ప్రకటించారు.
గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహిల్ ను అరెస్టు చేసి, జైలుకు పంపించిన పోలీసులు.. వ్యూహాత్మకంగా జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద కేసును తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో కారు నడిపింది రాహిల్ అని.. ప్రమాదం జరగగానే అతడు పరారై ఆఫ్రాన్ ను లొంగిపోయేలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో మహమ్మద్ మాజ్, బాధితురాలు కాజల్ చౌహాన్ ను పిలిపించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వాహనం నడిపింది రాహిల్ అని నిర్ధారించుకున్నారు.. కేసు దర్యాప్తును పున: ప్రారంభించారు. ఆఫ్రాన్ తన తాజా వాంగ్మూలంలో కారు నడిపింది రాహిల్ అని చెప్పినట్టు తెలిసింది. తనను బలవంతంగా కారు నడిపినట్టు అంగీకరించాలని రాహిల్ బంధువులు ఒత్తిడి చేశారని అతడు పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు లో అప్పటి దర్యాప్తు అధికారిగా ఎస్సై చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనను కూడా డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో విచారించారు. అంతేకాదు అప్పటి పోలీసుల వ్యవహార శైలి, కేసు దర్యాప్తులో వారి ప్రమేయంపై ప్రస్తుతం ఉన్న అధికారులు దృష్టి సారించినట్టు సమాచారం.