Cyber Crime: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది వీరి చేతుల్లో పడి సొమ్ములు కోల్పోతున్నారు. వ్యక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దుండగులు చెలరేగిపోతున్నారు. పుట్టినతేదీ నుంచి మొదలుకొని పాస్ వర్డ్ ల వరకు మన వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకొని బురడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన మొబైల్ వాడకం కారణంగా వస్తున్న లింక్ లను నొక్కితే ఏం జరుగుతుందో తెలియక చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తున్నా సైబర్ మోసగాళ్ల చేతుల్లో పడి లక్షలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ఒక్క తెలంగాణలోనే 6 నెలల్లో 165 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలాది మంది వీరి బారిన పడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన నరేందర్ అనే వ్యక్తి సెల్ కి మెసేజ్ వచ్చింది. సుమారు రూ. 5 వేలు ఆయన ఖాతాలో పడినట్లు సమాచారం అది. ఆ మెసేజ్ రాగానే కాసేపటికి ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి తన పేరు చెప్పి.. మీ అకౌంట్లో నా డబ్బులు జమయ్యాయి. నాకు కొంత అర్జంట్ ఉంది.. వాటిని తిరిగి పంపండి అని చెప్పాడు. అయితే నరేందర్ మెసేజ్ చూడగా 5 వేలు తన ఖాతాలో పడినట్లు కనిపించింది. వెంటనే ఆ డబ్బులను తిరిగి పంపాడు. కాసేపటికి బ్యాంకు ఖాతాలో చూసుకుంటే ఆ డబ్బులు లేవు. ఇందాక కాల్ వచ్చిన నంబర్ కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఇలా వేలాది మంది నిత్యం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. అమాయకులే టార్గెట్ గా ఈ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. అయితే ఈ నేరగాళ్లలో సగం మంది 20 నుంచి 30 ఏండ్ల లోపు యువకులే. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ ఎర్నింగ్ కోసంఇలాంటి వి ఎన్నుకుంటున్నారు.గత ఆరు నెలల్లో సుమారు 800 కు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీటి నుంచి రక్షణకు పోలీస్ అధికారులు కొన్ని ప్రత్యేక సూత్రాలు చెబుతున్నారు.
వ్యక్తిగత వివరాలను ఎవరితో పంచుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెట్టరాదు. బర్త్ డేలు , ఇతర తేదీలు పాస్ వర్డ్ గా పెట్టుకోవద్దు. మనకు తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయవద్దు. వెబ్ సైట్ లింకులను ఓపెన్ చేయవద్దు. ఉచితం, భారీ డిస్కౌంట్లు లాంటి ప్రచారాలను నమ్మి మోసపోవద్దు.
క్రెడిట్, డెబిట్ ఖాతాల వివరాలను సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉంచాలి. మనం డౌన్ లోడ్ చేసుకునే యాప్ ల విషయంలోనూ అత్యంత అప్రమత్తత అవసరం. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పాస్ వర్డ్ ను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. పబ్లిక్ వైఫ్ యూజ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్ వర్డ్ లు, మనం వాడే సెల్ ఫోన్లలో పెట్టుకోకపోవడమే మేలు.
ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్లతో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మనం డౌన్ లోడ్ చేసుకునే యాప్ ల్లో యాక్సెస్ అడిగిన వాటికి ఆలోచించి యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది.