India vs pakistan : ఆటను ఆటలాగా చూడాలి. కానీ దానిని పరువు సమస్యగా చూస్తేనే అసలు ఇబ్బంది. ఇటు మీడియా, అటు క్రికెట్ బోర్డులు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కు భావోద్వేగాలు జత చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.. ప్రజలు ఉద్రేకాలను పెంచుకొని ఏదేదో చేస్తున్నారు.. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గెలుపు వాకిట పాకిస్తాన్ బోల్తా పడింది. ముందుగానే చెప్పినట్టు ఉద్రేకాలు తారస్థాయిలో ఉండడంతో ఆయా దేశాలకు చెందిన అభిమానులు.. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు పాకిస్తాన్ అభిమాని ఏకంగా ఒక ట్రాక్టర్ అమ్మాడు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. దాన్ని మర్చిపోకముందే.. పాకిస్తాన్ ఓడిపోయిందనే బాధతో ఓ సెక్యూరిటీ గార్డ్ ఓ యూట్యూబర్ వ్లాగర్ ను కాల్చి చంపడం సంచలనంగా మారింది. “భారత్ – పాకిస్తాన్ తల పడినప్పుడు ఏదో జరిగిపోతోందన్నట్టుగా విశ్లేషణలు తెరపైకి రావడంతో ప్రజల్లో ఉద్రేకాలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని” విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
భారత్ – పాకిస్తాన్ తలపడిన రోజు.. పాక్ దేశానికి చెందిన ఫేమస్ యూట్యూబర్ సాద్ అహ్మద్ అనే వ్లాగర్ కరాచీ వెళ్ళాడు. అక్కడ ఓ ప్రధాన మొబైల్ మార్కెట్ ను సందర్శించాడు. అక్కడ అందరితో పిచ్చాపాటి గా మాట్లాడాడు. ఈ సమయంలో క్రికెట్ కు సంబంధించిన చర్చ జరిగింది దానికి సంబంధించి అతడు వీడియో తీస్తుండగా.. ఓ సెక్యూరిటీ గార్డ్ ఎదురయ్యాడు. ఆ సమయంలో భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి అతనిని అడిగాడు.. అయితే ఆ వీడియోలో ఆ సెక్యూరిటీ గార్డ్ కనిపించేందుకు ఇష్టపడలేదు.. ఇదే విషయాన్ని సాద్ పదేపదే ప్రశ్నించడంతో సెక్యూరిటీ గార్డ్ కు కోపం నషాళానికి అంటింది. గొడవ పెద్దది కావడంతో సెక్యూరిటీ గార్డ్ తన తుపాకీతో సాద్ అహ్మద్ పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులు జరిపిన వెంటనే సాద్ అహ్మద్ తీవ్రంగా గాయపడటంతో.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం కావడం.. కీలక భాగాల్లోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో కాపాడలేకపోయామని వైద్యులు నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ఆ యూట్యూబర్ ను చంపిన సెక్యూరిటీ గార్డును కరాచీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాద్ హత్య పాకిస్తాన్ దేశంలో సంచలనం రేపుతోంది. ఆ సెక్యూరిటీ గార్డ్ పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. అయితే మ్యాచ్ ముందు సాద్ వ్లాగ్ చేశాడని కొంతమంది అంటుంటే.. పాకిస్తాన్ ఓటమి దశలో ఉన్నప్పుడు అతడు పదే పదే సెక్యూరిటీ గార్డును ఇబ్బంది.. ఆ ఓటమిని భరించలేక అతడు ఈ పని చేశాడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పాక్ జట్టు ఓటమిలో ఉన్నప్పుడు యూట్యూబర్ ను కాల్చి చంపడం సరికాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు..