Crime news : రోడ్డు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కూతుళ్ల మృతి.. భర్త సేఫ్.. పోలీసుల విచారణ లో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు..

చెట్టును కారు ఢీ కొన్న తర్వాత రహదారి పైన వెళ్తున్నవారు ఆ దృశ్యాలను చూశారు. వెంటనే కారులో ఉన్న కుమారి, ప్రవీణ్, వారిద్దరి పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కుమారి కన్ను మూసింది. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు

Written By: Bhaskar, Updated On : July 15, 2024 8:56 am
Follow us on

Crime news : తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం లో మే 28న మంచుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన చెట్టును ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి (25), ఆమె పిల్లలు కృషిక (4), తనిష్క (3) దుర్మరణం చెందారు. రోడ్డు మీదకు కుక్క రావడంతో.. దానిని తప్పించబోయి.. ఆ కారు రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఓ చెట్టును ఢీకొంది. ఆ సమయంలో కారును కుమారి భర్త డాక్టర్ ప్రవీణ్ నడుపుతున్నాడు.

చెట్టును కారు ఢీకొనడంతో..

చెట్టును కారు ఢీ కొన్న తర్వాత రహదారి పైన వెళ్తున్నవారు ఆ దృశ్యాలను చూశారు. వెంటనే కారులో ఉన్న కుమారి, ప్రవీణ్, వారిద్దరి పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కుమారి కన్ను మూసింది. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై కుమారి తల్లిదండ్రులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రవీణ్ కారణమని.. అతడే తన కూతురు, ఆమె ఇద్దరు పిల్లల్ని చంపి ప్రమాదంగా చిత్రీకరించాడని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ముగ్గురి మృతదేహాలపై ఎటువంటి గాయాలు కనిపించకపోవడంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

ఖాళీ సిరంజిని ప్రయోగశాలకు పంపగా..

కుమారి బంధువుల ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రమాదం జరిగిన రోజు పోలీసులు ఆ కారులో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో వారికి ఒక ఖాళీ సిరంజ్ దొరికింది. ఎందుకైనా మంచిదని దానిని ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ వారు పరీక్షలు నిర్వహించగా.. విషం కలిపిన ఇంజక్షన్ అని తీరింది. మరోవైపు ప్రవీణ్ సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీలు చేశారు. అందులో కూడా పలు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. “హెవీ డోసేజ్ లో అనస్తీసియా ఇస్తే ఎంతసేపట్లో చనిపోతారనే” విషయాన్ని ప్రవీణ్ గూగుల్ లో తెగ శోధించినట్టు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక, ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక ఆధారంగా ప్రవీణ్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

మరో యువతితో సంబంధం

ప్రవీణ్ స్వగ్రామం రఘునాథపాలెం మండలం మంచుకొండ. అతడు హర్యాతండాకు చెందిన కుమారిని 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో ప్రవీణ్ కు కుమారి తల్లిదండ్రులు భారీగా కట్నం ఇచ్చారు. మొదట్లో ప్రవీణ్ కుమారితో బాగానే ఉండేవాడు. వారిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు సంతానంగా కలిగారు. అయితే ప్రవీణ్ తాను పని చేస్తున్న ఆసుపత్రిలో ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోజులో పడి కుమారిని దూరం పెట్టాడు. ఇదే సమయంలో కుమారి భర్తను నిలదీయడం మొదలుపెట్టింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. పంచాయితీలు కూడా జరిగాయి. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ప్రవీణ్ ఎప్పట్లాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

అడ్డు తొలగించుకోవాలని భావించాడు

భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు పెరగడంతో.. ప్రవీణ్ ఎలాగైనా కుమారి, ఇద్దరు పిల్లల్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కుమారితో మంచిగా ఉన్నట్టు నటించి.. ఆమెను, ఇద్దరు పిల్లల్ని తీసుకొని మంచుకొండ బయలుదేరాడు. ఆ తర్వాత కుమారి స్వగ్రామం హర్యా తండాకు కారును మళ్ళించాడు. ఇదే క్రమంలో కుమారి, ఆమె పిల్లల్ని మాటల్లో పెట్టి మోతాదుకు మించి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో వారు అచేతన స్థితిలోకి వెళ్లారు. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న ప్రవీణ్.. కారును చెట్టుకు ఢీకొట్టాడు. ఆ ఘటనలో అతడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. అయితే కుమారి, పిల్లలకు గాయాలు కాకపోవడంతో ఆమె తల్లిదండ్రుల్లో అనుమానం పెరిగింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.