UP Bridge Accident: ఆండ్రాయిన్ ఫోన్లు వచ్చాక.. ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక.. చాలా మంది గూగుల్ తల్లిని నమ్ముకుంటున్నారు. ఈ సెర్చ్ ఇంజిన్‌తో ప్రపంచం కూడా మన గుప్పిట్లోకి వచ్చింది. కానీ, గూగుల్ కారణంగా… గమ్యం చేరడంలో తప్పులు జరుగుతున్నాయి. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని చాలా మంది కొత్త ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ, కొన్నిసార్లు ఈ గుగుల్ మ్యాప్.. దానిని నమ్ముకున్నవారిని ప్రమాదంలోకి నెడుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అదే జరిగింది. గూగుల్‌ను ఫాలో అవుతూ అతి వేగంగా వెళ్లారు. కానీ, క్షణాల్లో యమలోకానికి చేరారు.
ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మిన ముగ్గురు వ్యక్తులు కారు డ్రైవ్ చేసుకుంటూ నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారుతో సహా నదిలో పడిపోయారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బాధితలు బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటాగంజ్‌కు ప్రయాణిస్తుండగా ఖల్పూర్–దతాగంజ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని జేసీబీ సాయంతో కారును నదిలో నుంచి బయటకు తీశారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
అతల్లిని నమ్ముకున్నందుకే..
గూగుల్ తల్లిని నమ్ముకుని ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. గూగుల్ నావిగేషన్ కారణంగా వంతెన అసంపూర్తిగా ఉన్న విషయం తెలియక కారును వేగంగా నడుపడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో ఖల్పూర్–దతాగంజ్ రహదారిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అయితే ఈ విషయం తెలియని బాధితులు జీపీఎస్ మ్యాప్‌తో బ్రిడ్జిపైకి వేగంగా కారులో వెళ్తున్నారు. దీంతో వంతెన పైనుంచి కారు కిందపడిపోయింది.
గూగుల్‌తో ఘోరం..
మనం తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు గూగుల్‌ను నమ్ముకోవడం చాలా మందికి అలవాటైంది. ఒకప్పుడు అడ్రస్ పట్టుకుని అడుగుతూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌నే నమ్ముకుంటున్నారు. ఈ కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. గూగుల్ రాంగ్‌రూట్ చూపడంతో ముగ్గురు వంతెన పైనుంచి నదిలో పడ్డారు.