Karnataka’s Marakumbi: కర్ణాటక రాష్ట్రం, గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామంలో దళితులను లక్ష్యంగా చేసుకొని 2014లో వివక్ష, కుల హింసకు పాల్పడిన కేసులో 98 మందికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక కొప్పల్ జిల్లా సెషన్స్ కోర్టు గురువారం (అక్టోబర్ 24) రోజున చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. 2014, ఆగస్ట్ 28వ తేదీ సినిమా టికెట్ల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి ఇంత పెద్ద వివాదానికి కారణమైంది. అంతకు ముందు రోజు సినిమా టిక్కెట్ల సమస్యపై 117 మంది అగ్రకులానికి చెందిన వ్యక్తులు నిమ్న వర్గానికి చెందిన ఇళ్లపై దాడులు, దౌర్జన్యాలు చేయడంతో పాటు వారి ఇళ్లను తగులబెట్టారన్న అభియోగాలు మోపారు. ఈ కేసులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు విచారణలో ఉండగా, నేరానికి పాల్పడిన 11 మంది మరణించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు కాగా జువైనల్ జస్టిస్ బోర్డు కింద వారిని విచారించారు. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ సీ ఈ కేసులో 101 మందిని దోషులుగా నిర్ధారించారు. వీరిలో ముగ్గురికి తేలికైన శిక్షలు వేశాడు. ఎందుకంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989, ఏ వర్గానికి చెందిన వారిపైనా ప్రయోగించలేదు.
అసలు ఆ రోజు ఏం జరిగింది..
2014, ఆగస్ట్ 27వ తేదీ మరకుంబికి చెందిన మంజునాథ్ తన స్నేహితులతో కలిసి గంగావతిలో సినిమా చూసేందుకు వెళ్లాడు. అక్కడ అదే గ్రామానికి చెందిన వ్యక్తులతో గొడవ జరిగింది. మంజునాథ్, అతని స్నేహితులు గ్రామానికి వచ్చి ఎస్సీ కాలనీకి చెందిన వారు తమపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని అగ్రవర్ణాల వారిని రెచ్చగొట్టారు. దీంతో అగ్రవర్ణానికి చెందిన ఒక గుంపు తెల్లవారు జామున 4 గంటలకు ఇటుకలు, రాళ్లు, కర్రలతో వారి కాలనీకి చేరుకొని కులం పేరుతో ధూషించడమే కాకుండా వారి గుడిసెలు, ఇళ్లపై దాడి చేశారు. గుడిసెలకు నిప్పు పెట్టారు.
‘ఈ ఘటన జరిగిన రెండు రోజులకు 29 ఆగస్ట్, 2014 తర్వాత బాధితుల ఫిర్యాదుతో ఈ కేసులో 117 మందిని విచారించారు. అంతకు ముందు రోజు సినిమా థియేటర్ వద్ద జరిగిన ఘర్షణకు ప్రతీకారంగా ఒక గుంపు దళితులపై దాడి చేసి వారి గుడిసెలను తగులబెట్టడం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని.’ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపర్ణ బుండి చెప్పారు.
ఘటన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా మరకుంబి మూడు నెలల పాటు పోలీసుల నిఘాలో ఉంది. ఈ దాడిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర దళిత హక్కుల సంఘం మారుకుంబి నుంచి బెంగళూర్ వరకు మార్చ్ ను నిర్వహించింది. కేసు పూర్వా పరాలు పరిశీలించని తర్వాత న్యాయమూర్తి ఈ శిక్ష వేశారు.
తీర్పు..
మొత్తం 101 మంది నిందితుల్లో 98 మందికి జీవిత ఖైదు విధించగా, ఎస్టీ వర్గానికి చెందిన మరో ముగ్గురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ. 2,000 నుంచి రూ. 5,000 జరిమానా విధించి జీవిత ఖైదీలను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు.