https://oktelugu.com/

Cyber Crime: ఖాతా నుంచి 1.10 కోట్లు మాయం.. 25 నిమిషాల్లోనే ప్రత్యక్షం..

హర్ష్ ఫిర్యాదు చేసిన అనంతరం.. అతడు చెప్పిన వివరాల ఆధారంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆధ్వర్యంలో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 30, 2024 / 09:22 AM IST

    Cyber Crime

    Follow us on

    Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సరికొత్త పంథాల్లో మోసం చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఏవో లింక్స్ పంపించి.. దానిని క్లిక్ చేయగానే.. వారి ఖాతాల వివరాలు తెలుసుకొని.. అందులో నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. ఇలాంటి అనుభవమే హైదరాబాద్ నగరానికి చెందిన హర్ష్ అనే వ్యక్తికి ఎదురైంది. ఈనెల 27న అతడికి మూడు ఎస్ఎంఎస్ లు వచ్చాయి. అతడి ఎకౌంట్ నుంచి ఉదయం 10 .09 గంటలకు 50 లక్షలు, 10.10 గంటలకు మరో 50 లక్షలు, 10.11 గంటలకు 10 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయని ఆ సంక్షిప్త సందేశాల సారాంశం. ఉదయం 10: 17 నిమిషాలకు ఆ సందేశాలు చూసిన అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

    అలా తన ఖాతాలో నుంచి డబ్బులు మాయం కావడంతో హర్ష్ అప్రమత్తమయ్యాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి.. బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. అంతటితో ఆగకుండా అదే రోజు ఉదయం 10:22 నిమిషాలకు 1930 నెంబర్ కు ఫోన్ చేసి.. తన ఖాతాలో డబ్బు మాయమైన తీరు గురించి పోలీసులకు వివరించాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి 25 నిమిషాల లోపే 10, 000 మినహా మిగతా డబ్బును వెనక్కి రప్పించారు.. హర్ష్ తెలివితేటలతో పోలీసులకు సమాచారం అందించడం.. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెంటనే స్పందించడంతో.. ఆ డబ్బును మోసగాళ్ళు డ్రా చేయలేకపోయారు. వాస్తవానికి సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును తిరిగి బాధితుల ఖాతాల్లోకి రప్పించడం దాదాపు సాధ్యం కాదు. అయితే ఖాతా నుంచి డబ్బు మాయమైన వెంటనే స్పందిస్తే ఉపయోగం ఉంటుందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెబుతున్నారు. హర్ష్ ఉదంతంలో “గోల్డెన్ అవర్” వల్ల ఎంతటి ప్రయోజనం ఉంటుందో మరోసారి నిరూపితమైందన్నారు.

    హర్ష్ ఫిర్యాదు చేసిన అనంతరం.. అతడు చెప్పిన వివరాల ఆధారంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆధ్వర్యంలో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. వారికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు తోడయ్యారు. క్యాష్ ట్రాన్స్ ఫర్ అయిన యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆఫీసర్లను అలర్ట్ చేశారు. వారు కూడా వెంటనే రెస్పాండ్ కావడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఆ సొమ్మును సైబర్ నేరగాళ్లు వారి ఖాతాల నుంచి డ్రా చేయకుండా నిలిపివేశారు. దీనిని బ్యాంకు పరిభాషలో ఫుట్ ఆన్ హోల్డ్ అంటారు. హర్ష్ ఫోన్ కు ఉదయం 10: 42 సమయంలో ఖాతాలో తిరిగి డబ్బు జమ అయినట్టు మెసేజ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నాడు. హర్ష్ అయితే ఎగిరి గంతేసాడు . అప్పటికి ఆ నేరస్తులు 10,000 డ్రా చేశారు. అయితే ఆ ఖాతాలు బెంగళూరులోని సజావుద్దీన్, సలీముద్దీన్ పేరుతో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. హర్ష్ ప్రమేయం లేకుండా డబ్బును సైబర్ నేరగాళ్లు ఎలా బదిలీ చేశారో? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్ల వల్ల డబ్బు పోగొట్టుకున్నవారు వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే.. తిరిగి తెప్పించేందుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.