https://oktelugu.com/

కరోనాకు సవాల్ చేస్తున్న తైవాన్!

ప్రపంచ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న ప్రపంచ జనాభాలోనే అతి పెద్దది కావడమే కాకుండా, సైనిక శక్తిలో సహితం అమెరికా తర్వాత పెద్దదైన చైనాకు పొరుగునే ఉన్న తైవాన్ తొలి నుండి ఆ దేశ ఆధిపత్యాన్ని అన్ని విధాలా సవాల్ చేస్తూ వస్తున్నది. తాజాగా కరోనా వ్యాధి వ్యాప్తి విషయంలో సహితం ఆ దేశాన్ని సవాల్ చేసే రీతిలో మొగ్గలోనే వైరస్ ను తుంచివేసి మొత్తం ప్రపంచాన్నే అబ్బుర పరుస్తున్నది. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌.. వేల […]

Written By: , Updated On : March 21, 2020 / 12:28 PM IST
Follow us on

ప్రపంచ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న ప్రపంచ జనాభాలోనే అతి పెద్దది కావడమే కాకుండా, సైనిక శక్తిలో సహితం అమెరికా తర్వాత పెద్దదైన చైనాకు పొరుగునే ఉన్న తైవాన్ తొలి నుండి ఆ దేశ ఆధిపత్యాన్ని అన్ని విధాలా సవాల్ చేస్తూ వస్తున్నది. తాజాగా కరోనా వ్యాధి వ్యాప్తి విషయంలో సహితం ఆ దేశాన్ని సవాల్ చేసే రీతిలో మొగ్గలోనే వైరస్ ను తుంచివేసి మొత్తం ప్రపంచాన్నే అబ్బుర పరుస్తున్నది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌.. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఖండాంతరాలకు విస్తరించింది. చైనా నుంచి 11,600 కి.మీ దూరంలో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను సైతం చివురుటాకులా వణికిస్తున్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఇప్పటివరకు 9,486 మందికి వైరస్‌ సోకగా, 174 మంది మరణించారు.

అయితే.. చైనాకు పక్కనే ఉన్న తైవాన్‌, వియత్నాం వంటి చిన్న దేశాలు మాత్రం కరోనాకు ఎదురునిలిచాయి. తమ దేశంలో వైరస్‌ విజృంభించకుండా అడ్డుకోవడంలో విజయం సాధించాయి.

ముఖ్యంగా తైవాన్‌ తీసుకున్న చర్యలు మొత్తం ప్రపంచాన్ని విస్మయ పరుస్తున్నాయి. చైనాలోని వుహాన్‌లో వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలుకాగానే ఆ దేశం కన్నా ముందుగా తైవాన్‌కు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’ (సీడీసీ) అప్రమత్తమైంది. తైవాన్‌లో జనవరి 21న మొదటి కరోనా కేసు నమోదైంది.

అన్ని దేశాల కంటే ముందుగానే తైవాన్‌ ప్రభుత్వం.. డిసెంబర్‌ 31న వుహాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్యపరీక్షలు తప్పనిసరి చేసింది. ఆ సమయంలో వుహాన్‌లో కేవలం 27 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

వారికి సార్స్‌ వంటి 26 రకాల వైరల్‌ వ్యాధుల పరీక్షలు చేసింది. పాజిటివ్‌ వచ్చినవారిని వెంటనే క్వారంటైన్డ్‌ కేంద్రాలకు తరలించింది. జనవరి 20 నుంచి వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రచారం మొదలుపెట్టింది.

తైవాన్‌ ప్రభుత్వం జనవరి 20న మాస్కుల తయారీని వేగవంతం చేసింది. 24న మాస్కుల ఎగుమతిపై నిషేధం విధించింది. సైన్యాన్ని రంగంలోకి దింపి యుద్ధప్రాతిపదికన మాస్కుల తయారీ మొదలుపెట్టింది.

కొత్తగా 62 ఫ్యాక్టరీలను ప్రారంభించింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రజలందరికీ పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించింది. తద్వారా అందరికీ సరిపడా మాస్కులు అందాయి.

వైరస్‌ వ్యాప్తి చెందకుండా తైవాన్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మొదటివారం నుంచే సానిటైజర్ల ఉత్పత్తిని రెట్టింపు చేసింది. 25న క్వారంటైన్డ్‌ దవాఖానను నెలకొల్పింది.

అన్ని దేశాలు స్టేజ్‌-1, స్టేజ్‌-2 హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలోనే తైవాన్‌ ఏకంగా స్టేజ్‌-3 హెచ్చరికలు జారీ చేసి ఆంక్షలను కఠిన తరం చేసింది.

మాస్కులు, గ్లౌజులు వంటివాటితోపాటు వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచింది. ఫలితంగా చైనా పక్కనే ఉన్నా.. మొదటి కేసు నమోదై రెండు నెలలు దాటినా.. తైవాన్‌లో ఇప్పటికీ కేసుల సంఖ్య 108కే పరిమితమైంది. ఇందులో 26 మంది కోలుకోగా, ఒకరు మాత్రమే మరణించారు.

ఇలా ఉండగా, అన్ని ఖండాలకు ఈ వైరస్ వ్యాపించినా అంటార్కిటికాలో మాత్రం ఇంకా ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. అక్క‌డ ప‌లు దేశాల‌కు చెందిన అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌కులు ఉన్నారు.

ఎటువంటి ఇన్ఫెక్ష‌న్లు కానీ క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న కేసులు న‌మోదు కాలేదు. అంటార్కిటికా వెళ్లే బ్రిటీష్ ప‌రిశోధ‌కులు ఎవ‌రైనా 14 రోజుల‌ క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.