
భారతదేశంలో కరోనా వల్ల ఉద్యోగులు, వ్యాపారులకు కలిగిన నష్టం అంతాఇంతా కాదు. దేశంలో నెలలు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. భారత్ లో ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు, వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. అయితే అందరికీ నష్టం చేస్తున్న కరోనా కేరళలోని ఒక వ్యక్తికి మాత్రం మేలు చేసింది. కరోనా వల్ల ఆ వ్యక్తికి నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలోని కొట్టాయమ్ జిల్లా కలతిప్పడిలో జార్జ్ అనే వ్యాపారి ఏడు సంవత్సరాల క్రితం కరోనా పేరుతో ఒక షాపును ప్రారంభించగా ఏడాది క్రితం వరకు ఆ షాపు నష్టాల్లో నడుస్తోంది. జార్జ్ తన షాపు ద్వారా కుండీలను, దీపాలను విక్రయిస్తూ ఉండేవాడు. సాధారణంగా ఆ షాపును పెద్దగా పట్టించుకోని ప్రజలు కరొనా విజృంభణ తరువాత మాత్రం ఆ షాపుకు వెళుతున్నారు.
దీంతో జార్జ్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. జార్జ్ మాట్లాడుతూ కరోనా విజృంభించిన తరువాత తన హోటల్ కు కరోనా పేరు ఉండటంతో వ్యాపారం విపరీతంగా వృద్ధి చెందిందని అన్నారు. అందరికీ చెడు చేసిన కరోనా తనకు మాత్రం మంచే చేసిందని జార్జ్ చెబుతున్నాడు. తన షాపుకు కరోనా అని పేరు పెట్టడం వెనుక కూడా ఆసక్తికరమైన కారణం ఉందని జార్జ్ చెప్పుకొచ్చాడు.
లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అనే అర్థం వస్తుందని ఆ పేరు తనను ఆకర్షించడంతో షాపుకు ఆ పేరు పెట్టుకున్నానని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా తన షాపుకు కస్టమర్లు వస్తున్నారని జార్జ్ తెలిపారు. కిరీటం ఆకారంలో ఉండటంతో శాస్త్రవేత్తలు సైతం వైరస్ కు కరోనా అని పేరు పెట్టడం గమనార్హం.