
‘సూపర్ స్టార్ కృష్ణ’కి సినిమాల్లోకి రావాలనే ఆలోచన వస్తున్న రోజులు అవి. తెనాలిలో ఒక రోజు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాకి నిర్మాత జగ్గయ్య. కృష్ణకి ‘జగ్గయ్య తమ్ముడు’ స్నేహితుడు, దాంతో కృష్ణకు జగ్గయ్యతో మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే కృష్ణకి అవకాశం ఇచ్చారు. ఆ రకంగా కృష్ణ తెరమీద కనిపించిన మొదటి సినిమా జగ్గయ్యగారు నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమానే.
నిజానికి కృష్ణకు ఈ సినిమాలో ప్రత్యేకమైన వేషం అంటూ ఏమి ఉండదు. కృష్ణది చాల చిన్న పాత్ర. కాంగ్రెస్ వాలెంటీర్ గా జనం అందరితో పాటు ఉండే జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర లాంటిది. అలాంటి పాత్ర అయినా, కృష్ణ నటించాలనే ఆసక్తి చూపించారు. కానీ, జగ్గయ్యకి మాత్రం కృష్ణ అంత చిన్న పాత్ర చేయడం ఇష్టం లేదు.
అందుకే, జగ్గయ్య వేషం ఇవ్వడానికి ముందు కృష్ణతో.. ఇది చాల చిన్న పాత్ర శివరామకృష్ణ. కేవలం కొన్ని సీన్లలో మాత్రమే నువ్వు కనిపిస్తావు. పైగా డైలాగులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరీ నువ్వు ఇష్టంగా వేస్తానంటేనే ఈ వేషం నీకు ఇస్తాను’ అన్నారు జగ్గయ్య. పాత్ర చిన్నది అయినా కృష్ణ మాత్రం ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. మొత్తానికి అలా కృష్ణను వెండితెరకు పరిచయం చేసిన క్రెడిట్ జగ్గయ్యకి దక్కింది.
అందుకే కృష్ణకి జగ్గయ్య అంటే చాల అభిమానం. ఆ అభిమానం వల్లే.. కృష్ణ నిర్మించిన ప్రతి సినిమాలో జగ్గయ్యకి అవకాశం ఇప్పించారు. జగ్గయ్య మంచి ఆర్టిస్టే కానీ షూటింగ్ కు మాత్రం చాల లేట్ గా వచ్చేవారు. ఆయనకు ఎక్కువగా వేషాలు ఇచ్చేవాళ్ళు కాదు. అయినప్పటికీ జగ్గయ్య మాత్రం ఏడు గంటలకు రావాల్సింది, తొమ్మిది గంటలకు షూటింగ్ కు వచ్చేవారు.
ఇక మద్రాసులో షూటింగ్స్ అయితే, పదిన్నర, పదకొండు గంటలకు జగ్గయ్య సెట్‌కు వచ్చేవారు. అయినా కృష్ణ మాత్రం ఎప్పుడూ ఈ విషయం గురించి ఎన్నడూ ఒక్క మాట కూడా జగ్గయ్యతో మాట్లాడలేదు. పైగా జగ్గయ్యగారికి ఎంతో గౌరవం ఇచ్చేవారు కృష్ణ.