
రాజమౌళి స్టాంప్ కు ఏ స్థాయి డిమాండ్ ఉందో మరోసారి తేలిపోయింది. జక్కన్న విజనరీని ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్ డమ్ తోడవడంతో.. RRR రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని అందరికీ తెలుసు. కానీ.. ఎక్కడికి వెళ్లిందన్నది మాత్రం పక్కగా తెలియలేదు. ఆ విషయాన్ని అంకెలతో సహా నిరూపించే సమాచారం ఇది. బాహుబలి ఈ లెక్కల దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.
RRR షూటింగ్ చివరి దశకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైంది. అయితే.. ఆ బిజినెస్ రేంజ్ తెలిస్తే మాత్రం జనాలు గుడ్లు తేలేయడం ఖాయం. ఈ సినిమా నార్త్ ఇండియా హక్కులను బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. నార్త్ థియేట్రికల్ హక్కులతోపాటు భారత్ లోని అన్ని భాషల డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ హక్కులకు 140 కోట్లు ఖర్చు చేసిందట సదరు సంస్థ. ఇక, డిజిటల్, శాటిలైట్ హక్కులకు మరో 300 కోట్లు వెచ్చించినట్టు సమాచారం.
ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ బిజినెస్ చేసింది. నైజాం, ఆంధ్రా కలిపి మొత్తం రూ.240 కోట్లకు ఈ సినిమాను అమ్మేసినట్టు సమాచారం. తమిళనాడులో 48 కోట్లు, కర్నాటకలో 45 కోట్లు, కేరళలో 15 కోట్లకు సినిమాను కొనుగోలు చేశారట బయ్యర్స్. ఓవర్సీస్ లో 70 కోట్లు వచ్చినట్టు సమాచారం. మ్యూజిక్ రైట్స్ ద్వారా కూడా 20 కోట్లు సాధించినట్టు టాక్.
మొత్తంగా.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 900 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. బాహుబలి కేవలం 500 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. రాజమౌళి టేకింగ్, హీరోల స్టార్ డమ్ తో ఈ రేంజ్ బిజినెస్ జరిగింది. మరి, సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.