
రానా దగ్గుబాటి తెలుగు ఇండస్ట్రీలో వెర్సటైల్ యాక్టర్ అని చెప్పడంలో సందేహం లేదు. చెప్పడమే కాదు.. ఆయన సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మూసధోరణి సినిమాల్లో నటించడు రానా. బాహుబలిలో భల్లాల దేవగా చెలరేగిపోతే.. ఘాజీలో కెప్టెన్ అర్జున్ గా అలరించాడు. లీడర్ లో రాజకీయ నాయకుడిగా.. ‘అరణ్య’లో అడివి మనిషిగా జీవించాడు.
ఇన్ని రకాల సినిమాలు చేసిన రానా నుంచి.. ఒక్క లవ్ స్టోరీ కూడా రాలేదు. నేను నా రాక్షసి వంటి చిత్రం చేసినప్పటికీ.. దాన్ని ప్రేమకథా చిత్రం అనలేం. దాదాపు హీరోలంతా ఇండస్ట్రీలోకి రావడానికి లవ్ స్టోరీస్ ను ఎంచుకుంటే.. రాజకీయ నాయకుడిగా తెరంగేట్రం చేశారు రానా.
ఎందుకిలా..? ఒక్క లవ్ స్టోరీ కూడా చేయకపోవడానికి కారణమేంటని ఇటీవల అడిగితే.. ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పారు దగ్గుబాటి వారసుడు. తాను కాలేజీకి వెళ్లలేదని, అక్కడ తనకు లవ్ స్టోరీస్ లేవని, అందుకే.. తాను అలాంటి స్టోరీలతో కనెక్ట్ కాలేనని చెప్పడం విశేషం.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన రానా.. పై విధంగా లవ్ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాడు. కాగా.. ప్రస్తుతం రానా, పవన్ తో తలపడుతున్న విషయం తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ శరవేగంగా కొనసాగుతోంది. సెప్టెంబరులో ఈ చిత్ర రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్